ఉపాధి పథకం రాష్ట్రానికి వరం

May 1,2025 17:09 #May Day, #pawan kalyan

 ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి ఒక వరమని ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మేడే సందర్భంగా మంగళగిరిలోని సికె కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ‘ఉపాధి కార్మికులతో ఆత్మీయ కలయిక’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ, అప్పుల పాలైన రాష్ట్రానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి నిధులు ప్రాణవాయువులా మారాయన్నారు. గత ఏడాది ఉపాధి పథకంలోనే రూ.10,669 కోట్లు ఖర్చు చేశామన్నారు. వేతనాల రూపంలో రూ.6,194 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. శ్రామికులే లేకపోతే దేశ ప్రగతి ముందుకు సాగదన్నారు. ఉపాధి కూలీలను దేశ నిర్మాణానికి చమటోడ్చే శ్రామికులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి వారిని ఉపాధి శ్రామికులుగానే పేర్కొంటామన్నారు. ఉపాధి పథకంలో 46.94 లక్షల కుటుంబాల్లో 75.23 లక్షల మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని తెలిపారు. గత ఏడాది 24.23 కోట్ల పని దినాలు కల్పించామని, 5.10 లక్షల కుటుంబాలకు వంద రోజుల పని చేసినట్లు చెప్పారు. ఈ పథకంలో మొట్టమొదటిగా వేతనాలు పెంచింది సిఎం చంద్రబాబు అని చెప్పారు. వేతనాలు రూ.307కు పెంచి ఇవ్వాలని కోరితే సిఎం వెంటనే అనుమతించారని చెప్పారు. పని ప్రదేశాల్లో గ్రామ పంచాయతీల సహకారంతో తాత్కాలికంగా పందేళ్లు వేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పల్లె పండుగలో భాగంగా 377.37 కోట్లతో 21,564 గోకులాలు పూర్తి చేశామని, రూ.60.75 కోట్ల వ్యయంతో 13,500 పశువుల నీటి తొట్టెలు నిర్మించామన్నారు. 317.91 కోట్లతో 63,582 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచినట్లు చెప్పారు. ఉపాధి శ్రామికులకు ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి భీమా యోజన పథకం అమలు కావడం లేదనే విషయాన్ని గుర్తించి ఒకే రోజు కోటి మందికి బీమా నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో పని సమయంలో ప్రాణాలు కోల్పోయిన శ్రామికులకు రూ.2 లక్షల పరిహారం లభిస్తుందని చెప్పారు. ఉపాధి సిబ్బందికి రూ.3 నుంచి 30 లక్షల బీమా సౌకర్యం కల్పించేందుకు ఎస్‌బిఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. నీటి సంక్షోభాన్ని అధిగమించడానికి, పంచాయతీరాజ్‌ శాఖ బలంగా పని చేయడానికి వార్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. వర్షపు నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రతి నిర్మాణంలో వర్షపునీటి హార్వెస్టింగ్‌ పద్ధతి పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధి పథకం శ్రామికులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్‌ కుమార్‌, కమిషనర్‌ కృష్ణ తేజ, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ డైరెక్టర్‌ షణ్ముఖ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️