- మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు ఆధారాలుంటే అరెస్టులు చేయకుండా సిట్ పేరుతో హడావిడి ఎందుకు చేస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వందరోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సిఎం చంద్రబాబు తిరుమల లడ్డూ విషయంలో దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. లడ్డూలో కల్తీ జరగలేదని టిటిడి ఇఒ మీడియాకు వివరించినా.. చంద్రబాబు అబద్ధాలను మానడం లేదన్నారు. చంద్రబాబు మాటలకు, టిటిడి ఇఒ మాటలకు పొంతన వుండటం లేదన్నారు. కల్తీ జరిగి వుంటే ఇన్ని రోజులుగా ప్రభుత్వం అరెస్టులు చేయకుండా ఏమి చేస్తుందని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి రాజకీయం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. జులై 23న రిపోర్టు వస్తే సెప్టెంబరు 19 వరకు రెండు నెలలపాటు ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. రెండు నెలలపాటు ల్యాబ్ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తనకు తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకుంటారని, ఆచరణలో అంతా వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు.
అరాచక పాలన : మేరుగ నాగార్జున
రాష్ట్రంలో అరాచక పాలనకు కూటమి ప్రభుత్వం కేంద్రంగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ఏమీ చేయకుండా ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అధికారులను, ప్రతిపక్షాలను చివరకు ప్రశ్నించే సొంత పార్టీ నేతలను కూడా వదలడం లేదని అన్నారు. కొలికిపూడి శ్రీనివాస్ మొదటి నుండి వున్న తెలుగుదేశం కార్యకర్తలను, మీడియాను బహిరంగంగానే బెదిరిస్తున్నారని అన్నారు. అలాగే కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌పై చేయిచేసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణరాజు.. అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగిస్తే చర్యలు లేవన్నారు. అలాగే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రజలపై దౌర్జన్యాలు చేశారని తెలిపారు. వీటిపై సిఎం చంద్రబాబు ఏమాత్రం స్పందించకపోవడం సరైంది కాదన్నారు.