- కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా రాష్ట్ర పాలకులు
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు
ప్రజాశక్తి -బాపట్ల : మోడీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు తెలిపారు. బాపట్ల ఎంఎస్‌ఆర్ కల్యాణ మండపంలోని కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ ప్రాంగణంలో సిపిఎం బాపట్ల జిల్లా మొదటి మహాసభ శనివారం ప్రారంభమైంది. మహాసభ సందర్భంగా నగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. సభలో బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం మోడీ చేతుల్లో బొమ్మలా మారిందన్నారు. సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజలను మద్యం మత్తులో ముంచేస్తుందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించమంటే.. మద్యం ధరలు తగ్గించామని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని బోర్డులు పెట్టే ప్రభుత్వం.. మద్యం అమ్మి ప్రభుత్వం నడపరాదని ఎందుకు ప్రచారం చేయదని ప్రశ్నించారు. విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల పేరుతో భారాలు మోపారన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడిచినా ఇంత వరకూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇవ్వకుండా అప్పుగా ఇస్తే టిడిపి కూటమి ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ.. దేశంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపుతోందన్నారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. సభకు అధ్యక్షవర్గంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.మజుందర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.ఆంజనేయులు, సిపిఎం నాయకులు ఝాన్సీ వ్యవహరించగా సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య కార్యదర్శివర్గ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకుడు నూతలపాటి కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు టి.కష్ణమోహన్, సిహెచ్.మజుందార్, జిల్లా మహాసభ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది జెడ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.