చినుకు పడితే కొండలెక్కాల్సిందే

పోలవరం నిర్వాసిత కుటుంబాల వ్యథలు వర్ణనాతీతం
నిర్వాసితుల ఉద్యమ నేత ఎం.నాగమణి

ప్రజాశక్తి – కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : ‘చినుకు పడితే చాలు.. పోలవరం నిర్వాసితులు కొండలు, గుట్టలు ఎక్కాల్సిందే.. అంతకుమించి తమను తాము రక్షించుకునేం దుకు మరో మార్గం లేదు. ఇటువంటి గ్రామాల్లో పర్యటించిన నాకు, మా బృందానికి కన్నీళ్లు తెప్పించే సమస్యలు కన్పించాయి’ అని పోలవరం నిర్వాసితుల ఉద్యమ నేత ఎం.నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర మహాసభకు ప్రతినిధిగా హాజరైన ఆమె తనను కలిసిన ప్రజాశక్తితో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రభుత్వాలన్నీ పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు చెబుతున్నప్పటికీ, దానికోసం తాత, తండ్రుల నాటి భూములు, పుట్టి పెరిగిన ఊళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను మాత్రం పట్టించుకోవడం లేదు. వీరి సమస్యలు పరిష్కరించాలని పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు వినతులు, ధర్నాలు, రాస్తారోకోలు తదితర రూపాల్లో నిరసన తెలియజేసినప్పటికీ గత వైసిపి ప్రభుత్వంగాని, నేటి టిడిపి కూటమి ప్రభుత్వంగాని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నిర్వాసిత గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు సిపిఎం ఆధ్వర్యాన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నేతృత్వంలో ‘పోలవరం పోరుకేక’ పాదయాత్ర నిర్వహించాం. ఆ పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నాను. నిర్వాసితుల కోసం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసినప్పటికీ అవి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు, వీటికి పెద్ద తేడా లేదు. దీంతో పోలవరం మండలంలోని నిర్వాసితులు పునరావాస కాలనీలకు వెళ్లలేదు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని నిర్వాసితులు గోదావరి వరద ముంపులో ఉండలేక కాలనీలకు వెళ్లారు. తగిన రోడ్లు డ్రెయినేజీలు, చివరకు శ్మశాన వాటికలు కూడా లేకపోవడం వల్ల నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడల్లా పిల్లాపాపలతో కొండలు, గుట్టలు ఎక్కి తలదాచుకోవాల్సిన పరిస్థితులను వారంతా మాకు వివరించారు. ఈ కాలనీల్లో ఉన్నా.. గోదాట్లో ఉన్నా ఒక్కటే అని మా బృందానికి అనిపించింది. ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో ఫుడ్‌ ప్యాకెట్లు, దుస్తులు ప్రజల నుంచి సహకరించి నిర్వాసితులకు పార్టీ తరఫున అండగా నిలిచాం. ఈ క్రమంలో యువత పాలక పార్టీలు చేస్తున్న అన్యాయాన్ని తెలుసుకుని ప్రతిఘటనకు కలిసొస్తున్నారు. ఈ సందర్భంగా పాలకులు మా నాయకులపై బెదిరింపు చర్యలకు, గృహనిర్బంధాలకు పాల్పడుతున్నారు. అయినా మేం వెనక్కితగ్గలేదు. అమాయక గిరిజన నిర్వాసితుల కోసం పోరాడుతున్నామనే సంతృప్తితో మేము మరింత ముందుకు సాగుతాం. ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో ఢిల్లీ స్థాయి వరకు పోలవరం ఉద్యమాన్ని తీసుకెళ్లాం. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండాను కలిసి సమస్యలను విన్నవించాం.’

➡️