నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం

Jan 9,2025 05:28 #AP High Court, #welfare hostels
  • సంక్షేమ హాస్టళ్ల దుస్థితిని వివరించండి : హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : పేద పిల్లలు చదువుకునే హాస్టళ్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. తగినంత నిధులు కేటాయించకుండా ఉంటే హాస్టల్‌ విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉంటారని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలు నేలపై ఎందుకు నిద్రపోతారో అర్థం చేసుకోవాలంది. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నిర్వహణపై ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.143 కోట్లు ఎలా సరిపోతాయని ప్రశ్నించింది. జిల్లాల్లోని హాస్టళ్లను సందర్శించి అందులోని విద్యార్థులతో మాట్లాడి నివేదిక ఇవ్వాలంది. విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ప్రకటించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై నివేదిక ఇవ్వాలంది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల్లో ఎంత మేరకు ఖర్చు చేశారో, ఇంకా నిధులు ఉన్నాయా లేవా, ఇంకా అవసరం ఉందా వంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణకు సంక్షేమశాఖ కమిషనర్‌ ఆన్‌లైన్‌లో హాజరుకావాలంది. జిల్లాల్లోని హాస్టళ్లను జిల్లా ఉన్న న్యాయ సేవాధికార సంస్థలు సందర్శించి అక్కడి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. పౌష్టికాహారం, తాగునీరు, దుప్పట్లు, దోమ తెరలు వంటి కనీస వసతుల కల్పనపై రిపోర్టు ఇవ్వాలంది.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పించాలని, ఆ విధమైన వాతావరణం లేదంటూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్‌ శ్రీగురు తేజ 2023లో పిల్‌ దాఖలు చేశారు. న్యాయవాది అరుణ్‌ శౌరి వాదిస్తూ, మరుగుదొడ్లు లేక ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి ప్రతివాదన చేస్తూ, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు పెంచుతామని, 1:7 నిష్పత్తిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ కౌంటర్‌లో హాస్టల్స్‌లో చదివే పిల్లలు, వారి కులాల ప్రస్తావన చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పిల్లల కులాలు ఎందుకని, వారి కులాలతో సంబంధం ఏమిటని ప్రశ్నించింది. పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

➡️