ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాక్షి దినపత్రిక సంపాదకులు ధనుంజయరెడ్డి, పల్నాడు జిల్లాకు చెందిన మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు డిమాండ్ చేశాయి. మాచర్ల మండలంలో జరిగిన పి హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసు ప్రచురణ వార్త కారణంగా సమాజంలో వైషమ్యాలు పెచ్చరిల్లుతాయనే సాకుతో కేసు బనాయించటం అక్రమమని ఎపిడబ్ల్యూజెఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు, ఎపి బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వి శ్రీనివాసరావు, కె మునిరాజు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. హంతకులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు, ఇటువంటి కేసులు బనాయించటం ఎంతమాత్రం సమంజసంగా లేదన్నారు. ప్రచురితమైన సమాచారంలో పొరపాట్లు ఉంటే వాటిని సవరించుకునేందుకు వివిధ మార్గాలు ఉన్నాయని వెల్లడించారు. ఆ దిశగా చర్యలు చేపట్టకుండా మీడియాను, జర్నలిస్టులను భయభ్రాంతులను చేసే వైఖరిని పోలీసులు అనుసరించటం సరైనది కాదని అన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని పోలీస్ స్టేషన్ వ్యవహారాలపై ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించి కూడా 8 దినపత్రికలకు పోలీసులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. జర్నలిస్టులను భయభ్రాంతులను చేసే చర్యలకు పోలీసులు పాల్పడకుండా ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియుడబ్ల్యూజె) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐవి సుబ్బారావు, చందు జనార్థన్, ఐజెయు జాతీయ కార్యదర్శి సోమసుందర్, సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రామణారెడ్డి కోరారు. ఈ మేరకు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
