- నరసరావుపేట సబ్‌జైలులో వైసిపి కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన తరగతుల వారిని వేధించడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని సబ్‌జైలులో ఉన్న చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్య్రం కూడా లేకుండా చేశారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే ఆయన అనుచరుడు బాషా తప్పుడు కేసులు బనాయించాడని ఆరోపించారు. తనపై దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారంటూ, అసభ్య పదజాలంతో దూషించారంటూ రాకేష్ గాంధీ మరో ఇద్దరిపై పోలీసులకు బాషా ఫిర్యాదు చేశాడని తెలిపారు. కానీ ఘటన జరిగిన రోజు రాకేష్, అతని సన్నిహితులు గుంటూరు, హైదరాబాద్‌లో ఉంటే చిలకలూరిపేటలో దాడికి ఎలా యత్నిస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల మెప్పుకోసం పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని, దీనిపై పూర్తి ఆధారాలతో న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.