ఆర్‌టిసిలో అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలి : ఎస్‌డబ్ల్యుఎఫ్‌

Jun 11,2024 22:34 #Illegal suspensions, #Lifted, #RTC, #SWF

– ఎమ్‌డి ఆఫీసు వద్ద నిరసన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎపిఎస్‌ఆర్‌టిసిలో ఎన్నికల కోడ్‌ పేరుతో అక్రమంగా సస్పెన్షన్‌లో వుంచిన ఉద్యోగులపై తక్షణమే ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యుఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్‌టిసి ఎమ్‌డి కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్‌కె జిలాని భాషా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నిబంధనావళి పేరుతో 154 మంది ఆర్‌టిసి ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలను తీసుకున్నారని తెలిపారు. ఇందులో 51 మందిని సస్పెండ్‌ చేశారని విమర్శించారు. ఎంసిసి పరిధిలోకి రాని ఆర్‌టిసి ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం తగదన్నారు. ఏలూరులో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై జరిగిన సమావేశంలో పాల్గన్నందుకు ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ సుందరయ్య పైన మాత్రమే చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు? అదే సమావేశంలో అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పాల్గన్నా.. వారెవరిపై చర్యలు లేవని, ఇలాంటి అక్రమ సస్పెన్షన్లు తక్షణమే ఎత్తివేయాలని కోరారు. అక్రమంగా సస్పెండ్‌ చేసిన డిపిటిఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి టిపిఆర్‌ దొర, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు భాస్కర్‌రావు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోషియేషన్‌ నాయకులు డిపిఆర్‌ రెడ్డి తదితరులు పాల్గన్నారు.

➡️