హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు తక్షణ చర్యలు

  • 6న హైకోర్టు జడ్జీల బృందం కర్నూలుకు రాక : మంత్రి ఫరూక్‌

ప్రజాశక్తి- నంద్యాల కలెక్టరేట్‌ : కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ తెలిపారు. నంద్యాలలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తున్నట్టు తెలిపారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు వద్ద ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన భవనాన్ని బృందం పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. 2014-19 సమయంలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. దానికి అనుగుణంగానే కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలంటే 15 మంది జడ్జిలు ఉండాలని, అందుకు కావలసిన భవనం, అందులో మౌలిక సదుపాయాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే కర్నూలు కలెక్టర్‌ స్థలాన్ని పరిశీలించడంతోపాటు ఎపి విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన భవనాన్ని గుర్తించినట్లు చెప్పారు. వాటిని పరిశీలించడానికి, ఇక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి హైకోర్టు న్యాయమూర్తుల బృందం వస్తున్నట్లు తెలిపారు.

➡️