హై కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు

Mar 23,2025 22:01 #AIKS, #AP High Court
  • ఎపి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భూములు సేకరించిన ప్రాంతాల్లో సర్వం కోల్పోతున్న వ్యవసాయ కార్మికులకు పునరావాసం, పునర్నిర్మాణం చేపట్టాలని హై కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. 2016-17 మధ్య కాలం అప్పటి ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల పేరుతో సుమారు 5 లక్షల ఎకరాల భూములను సేకరించిందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ఆదివారం విడుదల చేసిన తెలిపారు. ఈ భూ యజమానులైన చిన్న, సన్న కారు రైతులతో పాటు సర్వం కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు పునరావాసం, పునర్నిర్మాణం చేపట్టాలని 2016లో హై కోర్టును వ్యవసాయ కార్మిక సంఘం ఆశ్రయించిందన్నారు. 2017లో అందరికీ పునరావాసం, పునర్నిర్మాణం చేపట్టాలని తీర్పు చెప్పిందని పేర్కొన్నారు.
గత వైసిపి ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు కోర్టు తీర్పును ఉల్లంఘించాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా వంగలి గ్రామంలో పెట్రో కెమికల్‌ పేరుతో పేదల నుంచి భూములు ప్రభుత్వం లాక్కుందని, ఈ భూములు ప్రభుత్వానికి చెందిన అసైన్మెంట్‌ భూములని నష్టపరిహారం ఇవ్వకుండా ఉల్లంఘించిందన్నారు. దీనిపై వంగలి గ్రామ ప్రజలు తరుపున హై కోర్టును వ్యవసాయ కార్మిక సంఘం ఆశ్రయించిందని చెప్పారు. ఎట్టకేలకు వంగలి గ్రామంలో ఉన్న నిర్వాసితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూములు కోల్పోయిన రైతులకు, భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులకు, వృత్తిదారులకు పునరావాసం, పునర్నిర్మాణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హై కోర్టు తీర్పు చెప్పిదని తెలిపారు. ఈ తీర్పును ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. పేదల కోసం సుదీర్ఘకాలం హై కోర్టులో వాదించిన విజయం చేకూర్చిన న్యాయవాదులు సిహచ్‌.రవికుమార్‌, కె.ఎస్‌.మూర్తి కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.

➡️