- మంత్రి సంధ్యారాణికి ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వినతి
ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : రాష్ట్రంలో అంగన్‌వాడీలకు ఎన్నికలకు ముందు, ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారావమ్మ కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి అంగన్‌వాడీ ప్రతినిధులతో కలిసి సోమవారం ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో 42 రోజుల సమ్మె సందర్భంలో అంగీకరించిన అంశాలు అమలు చేయాలని, మినిట్స్ కాపీ ఆధారంగా పెండింగ్‌లో ఉన్న జిఒలు ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీ యూనియన్‌తో చర్చించి అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని, గ్రాడ్యూటీ అమలు చేయాలని, రాష్ట్రంలోని అన్ని మినీ సెంటర్లనూ మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జిఒ ఇవ్వాలని, ప్రీస్కూల్ పిల్లలకూ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, ఐదేళ్లలోపు పిల్లలందరూ అంగన్‌వాడీ సెంటర్లలో ఉండేలా ఇఒ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చుల కింద రూ.20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమ్మె కాలంలో చనిపోయిన వారికి కూడా దీనిని అమలు చేయాలని, అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణకు అమలు చేస్తున్న నాలుగు యాప్‌లను ఒకే యాప్‌గా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు కనీసం మూడు నెలలు ఇవ్వాలని, రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిన విజయనగరం జిల్లాóలోని గంట్యాడ, విజయనగరం ప్రాజెక్టులలో అమలు చేస్తున్న ఎఫ్‌ఆర్‌ఎస్‌ను వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, కొన్ని సమస్యలపై అధికారులతో ఇప్పటికే చర్చించామని, నవంబర్లో యూనియన్లతో కూడా చర్చించి మిగిలిన వాటిని బడ్జెట్ సమావేశాలు ముందు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలసిన వారిలో యూనియన్ జిల్లా కార్యదర్శి జి జ్యోతి, జిల్లా కమిటీ సభ్యులు శశికళ తదితరులు ఉన్నారు.