ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కెవిపిఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి గురువారం బహిరంగ లేఖ రాశారు. దళిత, గిరిజనుల సబ్‌ప్లాన్‌కు 25 శాతం నిధులు కేటాయించాలని, దళితులకు 6.28 శాతం, గిరిజనులకు 2.56 శాతం చొప్పున 9 శాతం మాత్రమే బడ్జెట్‌లో నిధులు కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన 29 పథకాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని, భూమి కొనుగోలు పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఆడబిడ్డ నిధి, దీపం, అన్నదాత సుఖీభవ, యువగళం, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, 50 ఏళ్లు పైబడినవారికి నెలకు రూ.4 వేలు పింఛను పథకాలను అమలు చేయాలన్నారు.