వైభవంగా శ్రీకోదండరాముడి చక్రస్నానం

  • ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

ప్రజాశక్తి – ఒంటిమిట్ట : వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం జరిగింది. విశేష సంఖ్యలో యాత్రికులు పాల్గొని స్నానాలు చేశారు. ఆలయంలో ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం, ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు రాముడు, సీత, లక్ష్మణ ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిలో సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగించి పుష్కరిణికి తీసుకొచ్చారు. ఉదయం 9.30 గంటలకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు చేశారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో డిప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 10వ రోజు మంగళవారం సాయంత్రం ఆరు నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.

➡️