- ‘ప్రజాశక్తి’తో అనంతగిరి జడ్‌పిటిసి గంగరాజు
ప్రజాశక్తి- కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : గిరిజన సమస్యలపై విశాఖ జిల్లా పరిషత్తులో గళం విప్పుతున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి జడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు తెలిపారు. సిపిఎం రాష్ట్ర మహాసభకు ప్రతినిధిగా హాజరైన ఆయన ‘ప్రజాశక్తి’తో మాట్లాడారు. గిరిజన ప్రాంత సమస్యలపై సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన ఆందోళనలు, సాధించిన విజయాలను వివరించారు. గిరిజన ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిఒ నంబర్ 3 ప్రకారం షెడ్యూల్ ఏరియాలోని గిరిజనులకు నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జిల్లా పరిషత్తు సమావేశంలో పలుమార్లు ప్రస్తావించారు. 2022లో సుప్రీంకోర్టులో ఈ జిఒను కొట్టేశాక దీని పునరుద్ధరణకు జడ్‌పిలో గట్టిగా వాదించారు. ఐటిడిఎ పరిధిలో పనిచేస్తున్న 807 మంది భాషా వలంటీర్ల ఉద్యోగ భద్రతకు పోరాడారు. కులం వెబ్ సైట్ నుంచి తొలగించిన భగత, వాల్మీకి, కొండదొర, గౌడ కులాలను సిపిఎం పోరాటంతోనే తిరిగి కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో డోలి మోత, రోడ్ల అభివృద్ధికి రూ.60 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించి నిధులు రాబట్టారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తాగునీరులేని గిరిజన ప్రాంతాలకు అధికారిని తీసుకెళ్లి పరిస్థితిని చూపించి జలజీవన్ మిషన్ కింద నీటి సౌకర్యం కల్పించారు. పల్లె పండగ నిధులు అల్లూరు జిల్లాకు కూడా కేటాయించాలని జడ్‌పి సమావేశంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లారు. కొండపోరంబోకు భూములను సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడి పట్టాలు ఇప్పించారు. పంచాయతీల నిధులు దారి మళ్లించడం వల్ల మౌలిక సౌకర్యాల కల్పన కుంటుపడిందని, కేరళ తరహాలో గ్రామస్వరాజ్యం అమలు కావాలంటే ఇక్కడా అదే తరహాలో నిధులు, విధులు కేటాయించి అభివృద్ధి చేయాలని గంగరాజు అన్నారు. గిరిజన సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాడుతోందని తెలిపారు.