రోడ్డు పేరుతో రూ.లక్షలు మింగేశారు.. ఆ గ్రామానికి డోలీమోత తప్పలేదు..!

May 15,2024 12:42 #lakhs, #swallowed, #villages problems

కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు) : ఆ గ్రామానికి రోడ్డు లేదు.. మహిళలకు ప్రసవ సమయంలో, ఎవరికైనా ఆరోగ్యం విషమించినప్పుడు డోలీలపై మోసుకుంటూ ఆసుపత్రికి పోవాలి.. 6 కిలోమీటర్లు అలా నడవాలి.. ఆ గ్రామస్తులంతా కలిసి శ్రమదానంతో రోడ్డు వేశారు. అదికాస్తా వాన దెబ్బకు కొట్టుకుపోయింది. ప్రభుత్వం ఆ గ్రామానికి రోడ్డు వేయాల్సిందిగా రూ.70 లక్షలు మంజూరు చేసింది.. కాంట్రాక్టర్లు వేసీవేయనట్లు రోడ్డు వేశారు.. కనీసం అంబులెన్స్‌ కాదు కదా.. ఆటోలు కూడా ఆ రోడ్డుపై రావడం లేదు.. కానీ బ్రహ్మాండంగా రోడ్డేశాం అని బిల్లులు మార్చేసుకున్నారు. గ్రామానికి అన్యాయం చేశారు..!

పూర్తి వివరాల్లోకెళితే …. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయితీ జాజులు బంధ.కొండ శిఖర గ్రామంలో 29 కుటుంబాలు 14 మంది జనాభా కలిగి ఉన్నారు. మర్రి కావ్య (21) గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున ఆమెకు ఆయాసం, కడుపులో నొప్పి విపరీతంగా రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆరు కిలోమీటర్ల దూరం డోలులో ఆమెను మోసుకొని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల గ్రామం వరకు తీసుకెళ్లారు. అంబులెన్స్‌ కి ఫోన్‌ చేస్తే. కనీసం రెస్పాన్స్‌ కూడా లేదు. గతవారం డౌన్‌లోడ్‌ చేసిన నెంబర్‌ ఆధారంగా వైద్యాధికారికి ఫోన్‌ చేయగా. వారు కూడా స్పందించలేదు. దీనితో గత్యంతరం లేక కావ్య తన కుటుంబ సభ్యులతో పాటు భర్త మర్రి కామేష్‌, ఇతర కుటుంబాలను కూడా బతిమాలుకుంది. దీంతో ఈరోజు ఉదయం 8 గంటలకే కావ్యను డోలులో మోసుకుంటూ బుచ్చింపేట ప్రాథమిక వైద్య కేంద్రం వద్దకు తరలించి వైద్యం అందించారు.

2021 సంవత్సరంలో జాజుల బంధ, పిత్రి గడ్డ, నీళ్ల బంధ గ్రామస్తులు అందరూ కలుపుకొని ఏడు లక్షల రూపాయలు చందాలు వేసుకుని ఆర్ల నుండి జాజుల బంధం మీదిగా ప్రొక్లయిన్‌ సాయంతో ఫార్మేషన్‌ ఆఫ్‌ రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆటోలు బైకులు తిరుగుతుండేవి. భారీ వర్షాలకు ఆ రోడ్లు కొట్టుకుపోయాయి. 2023-24 సంవత్సరంలో ఆర్ల గ్రామం నుండి కుంబుర్ల గ్రామం వరకు 9 కిలోమీటర్ల కి గ్రావెల్‌ రోడ్డు నిర్మాణం కోసం 70 లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేశారు. అయితే… శ్రమదానంతో నిర్మాణం చేసుకున్న రోడ్డుకు 28 రోజులపాటు ప్రొక్లెయిన్‌ తో పని చేయించి 29 లక్షల రూపాయలు బిల్లులు మార్చేశారు. కానీ కనీసం అంబులెన్స్‌ కానీ, ఆటో కానీ అటు నడవకుండా తూ.తూ.మంత్రంగా రోడ్డు పనులు చేసి వదిలేశారు.

రోడ్డు పడలేదు.. బిల్లులు మార్చుకున్నారు … ఏం న్యాయం : గ్రామస్తుల ఆవేదన
దీనిపై ఆదివాసి గిరిజనులు తమ గోడును ప్రజాశక్తితో వెళ్లబోసుకున్నారు. ” మా ఆదివాసి గిరిజనులం వేసుకున్న రోడ్డుపై ఎలాంటివి కలవడం లేదు.. రోడ్డు నిర్మాణం చేయకుండా, నిర్మాణం చేసినట్లు… బిల్లులు మార్చుకోవడం ఎంతవరకు న్యాయం. నేటికీ మేమంతా ఎలక్షన్‌ సమయంలో 6 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్ల గ్రామం కు వచ్చాము. అక్కడినుండి సుమారుగా 20 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించి ఓట్లు వేశాము. మాకు అంబులెన్స్‌ వస్తుందని భావించాము. 29 లక్షల రూపాయలు ఈ నెల 2వ తేదీన కాంట్రాక్ట్‌ అకౌంట్లో బిల్లులు మార్చేశారు. వర్క్‌ ఐడి నెంబర్‌ 0203101403 /ఆర్‌సి/999905210604/జిఎస్‌బి/ఇన్‌క్లూడింగ్‌/సిడి వర్క్‌ నిమిత్తం వండర్‌ పైలా నాగ వెంకటరమణ పేరు మీద 29 లక్షల రూపాయలు బిల్లు చేసినట్టుగా ఎఫ్‌టిఒ రిపోర్టులో తేలింది. ఇదేం న్యాయం. మేము రోడ్డు ఫార్మేషన్‌ చేసుకున్నాము. ఇలాంటి కలవట్లు కట్టకుండా. పైపై పొట్లెంత పనిచేసే. ఆటోలు తిరగకుండా చేసి. బిల్లులు మార్చారు ఇదేం న్యాయం. తక్షణమే ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ తో సమగ్రమైన విచారణ చేపించి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి ” అంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. అసంపూర్తిగా రోడ్డు నిర్మాణం చేసి బిల్లును చెల్లించిన అధికారులపై చర్య తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

➡️