తిరుపతి ఘటనలో రూ.కోటి పరిహారం ఇవ్వాలి

ప్రజాశక్తి- నెల్లూరు : తిరుపతి ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగనున్న సిపిఎం రాష్ట్ర 27వ మహాసభ వాల్‌పోస్టర్‌ను నెల్లూరులోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి భవన్‌లో శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖలో ప్రధాని పర్యటనకు పోలీసు భద్రత కల్పించడంలో బిజిబిజీగా గడిపారన్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన యాత్రికుల భద్రతను గాలికొదిలేసి విశాఖలో మోడీ స్వామికి సేవలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పరుగులు తీసిందన్నారు. తిరుపతిలో యాత్రికుల తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, మరో 40 మంది అస్వస్థతకు గురవ్వడం ప్రభుత్వ అసమర్ధత, చేతకానితనం వల్లనే జరిగిందన్నారు. ఒక రోజు ముందుగానే యాత్రికులందరినీ ఒకే చోటుకు చేర్చి, రాత్రి వరకూ నిలబెట్టి తొక్కిసలాటకు ప్రభుత్వం పరోక్షంగా కారణమైందని పేర్కొన్నారు. రోప్‌ పార్టీ లేదని, యాత్రికులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ గడిపేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని మభ్యపెట్టేందుకు ఒకరికొకరు క్షమించాలంటూ పోటీలుపడి ప్రాధేయపడుతున్నారన్నారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చగలరా? అని ప్రశ్నించారు. కేవలం పాతిక లక్షల రూపాయలు ఒక్కొక్క మృతుడి కుటుంబానికి అందజేస్తే సరిపోదన్నారు. కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనల నివారించేందుకు టిటిడి బోర్డు చైర్మన్‌, సభ్యులు ఏమి చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. వేరే ప్రార్ధనా మందిరాల వద్ద ఇటువంటి ఘటనలు చోటు చేసుకొని ఉంటే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేవారని, తిరుపతిలో జరిగిన ఘటనపై ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, విశ్వహిందూ పరిషత్‌ వారు ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. మృతి చెందిన వారు, గాయపడిన వారు హిందువులు కాదా? ఈ ప్రభుత్వాలకు ఏ మాత్రమూ బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనానికి యాత్రికులు తిరుపతికి రావాలని పిలుపునిచ్చి వచ్చిన వారికి భద్రత కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని తెలిపారు. గతంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్న సమయంలో ఆయా శాఖల మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి ఆ మాత్రం నైతిక విలువలు లేవా? అని ప్రశ్నించారు. సంక్రాంతికి ప్రజలు సంతోషంగా లేరని తెలిపారు. ఏటా ప్రభుత్వాలు ప్రజలకు పండగల సందర్భంగా ఇచ్చే కానుకలు ఈ ఏడాది అందజేయకపోవడం శోచనీయమన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఇస్తామన్న నగదు తదితర పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వ రంగం రీసెర్చి సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఉత్పత్తి తగ్గిపోవడానికి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడమే కారణమని నివేదిక విడుదల చేసిందని తెలిపారు.

ప్రజలను మభ్యపెడుత్ను న్న ప్రభుత్వాలు

రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని, లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని వి.శ్రీనివాసరావు విమర్శించారు. రానున్న ఐదేళ్లలో ప్రజలకు ఏమి చేస్తారో చెప్పకుండా, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా విజన్‌ 2047 పేరుతో ఆర్భాటంగా హామీలు కురిపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. ప్రధాన మంత్రి విశాఖ వచ్చి 2 లక్షలా 8 వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉబ్బితబ్బిబై పోతున్నారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడకపోవడం దారుణమని తెలిపారు.

సెకి ఒప్పందాన్ని రద్దు చేయాలి

సెకి ఒప్పందాన్ని రద్దు చేయాలని తాము డిమాండ్‌ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని వి.శ్రీనివాసరావు తెలిపారు. విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెంచి ఈ ఏడాది పెంచలేదని ప్రకటించడం దారుణమన్నారు. స్మార్ట్‌ మీటర్లు బిగించరాదని, ట్రూ అప్‌ ఛార్జీల వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేయకుండా నగదు కట్టించుకొని, తిరిగి వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. ఇప్పటికీ కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్‌ సిలిండర్ల నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు.

➡️