ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్‌పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు పెట్టిన యువకుడిని గుంటూరు జిల్లా పత్తిపాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గత ఎన్నికల ముందు పవన్ కల్యాణ్‌కు, సినీ నటుడు అల్లు అర్జున్ మధ్య ఉన్న రాజకీయ వైరం నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన పుట్టపాశం రఘు అలియాస్ పుష్పరాజ్.. మార్కు శంకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని గుంటూరులో జిల్లా ఎస్‌పి సతీష్‌కుమార్ తెలిపారు. ఈ పోస్టుపై ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. కర్నూలు వెళ్లి రఘు ఖాతాలను పరిశీలించినట్టు తెలిపారు. నిందితుడు ఐదు మొబైల్ ఫోన్‌ల ద్వారా 14 మెయిల్ ఐడిలను వాడి సోషల్ మీడియా ఎక్స్‌లో ఖాతాలను తెరిచారని వివరించారు. రఘు చేసిన పోస్టులను పరిశీలించామని, ఎక్కువగా మహిళలను కించపరిచేవిగా ఉన్నాయని తెలిపారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, రెండు గ్రూపులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు రఘుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని మీడియా సమావేశంలో ఎస్‌పి వెల్లడించారు.
