- నెల్లూరులో 3 రోజులు సాంస్కృతిక ఉత్సవాలు
- సిపిఎం రాష్ట్ర మహాసభ ఉద్యమ గీతాల సిడి ఆవిష్కరణలో వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : రాష్ట్రంలో సాగుతున్న ఉద్యమాలకు ప్రతీకగా రాష్ట్ర నలుమూలల నుండి నాలుగు ప్రచార జాతాలు నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరు నగరంలో వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో జరగనున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రజానాట్యమండలి రూపొందించిన పాటల సిడిని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్‌లో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. నెల్లూరులో జరగనున్న రాష్ట్ర మహాసభ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి నాలుగు జాతాలు ప్రారంభమై ఈ నెల 31 నాటికి నెల్లూరు చేరుకుంటాయన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా, విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ప్రాణాలు త్యాగం చేసిన 32 మంది అమరవీరుల స్మారకంగా విశాఖ నుంచి ఒక జాతా ప్రారంభం అవుతుందని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి మరో జాతా బయలుదేరనుందని చెప్పారు. విద్యుత్ రంగ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, అదాని, సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ నంద్యాల నుంచి మూడవ జాతా ప్రారంభం కానుందని తెలిపారు. వైఎస్‌ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప నుంచి 4వ జాతా బయలుదేరనుందని వివరించారు. ఈ నాలుగు జాతాలూ వాటి పర్యటన ప్రాంతాల్లో ప్రచారం చేసి ఈ నెల 31వ తేదీ రాత్రికి నెల్లూరు నగరానికి చేరుకుంటాయన్నారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరారు. ప్రజా నాట్యమండలి నిర్వహించిన పాటల సిడిలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ మహాసభల విశిష్టతను వివరిస్తామని చెప్పారు. కమ్యూనిస్టు భావాల ప్రచారానికి కళారూపాలు, కళాకారుల కృషి ఎంతైనా ఉందన్నారు.
సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభనున్న తమ్మారెడ్డి భరద్వాజ
రాష్ట్ర మహాసభ సందర్భంగా నెల్లూరు నగరంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడ్రోజులపాటు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్టు వి.శ్రీనివాసరావు తెలిపారు. 27న సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని, చివర రోజు ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ మూడు రోజుల సాంస్కృతికోత్సవాల కార్యక్రమాల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొంటారని చెప్పారు.
3న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా బృందా కరత్
మహాసభ చివరి రోజైన 3న నెల్లూరు నగరంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపి బృందా కరత్ ముఖ్యఅతిధిగా, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఎంఎ బేబి హాజరవుతారని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతినిధులు మూడ్రోజులు సభల్లో పాల్గొంటారన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలపై సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సాంస్కృతిక సబ్‌కమిటీ జిల్లా కన్వీనర్ మంగళ పుల్లయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు, షేక్ రెహనా బేగం, పార్టీ సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్, సిఐటియు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి గండవరపు శేషయ్య తదితరులు పాల్గొన్నారు.