ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు స్టేషన్‌లలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ నెల 12న వర్చువల్‌గా ప్రారంభిస్తారని రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం.రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు డివిజన్‌లోని మొత్తం రెండు గతి శక్తి టెర్మినల్స్, 21 స్టేషన్లలో ఉత్పత్తి స్టాల్స్, ట్రాలీలు, నాలుగు డబ్లింగ్ ప్రాజెక్టులు, ఒక కోచ్ రెస్టారెంట్‌ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడు వద్ద చెట్టినాడు సిమెంట్స్ కోచ్, దాచేపల్లి మండలం తుమ్మలచెరువు, సాయి బాలాజీ వేర్ హౌసింగ్ లాజిస్టిక్స్ ప్రారంభిస్తారని చెప్పారు. స్టేషన్లలో వివిధ రకాల సంప్రదాయ ఉత్పత్తుల తయారీ యూనిట్ల రూపకల్పన, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. గుంటూరు వద్ద ఒక రైలు కోచ్ రెస్టారెంటు, గుంటూరు- గుంతకల్ సెక్షన్ మధ్య 4 డబ్లింగ్ ప్రాజెక్టులు వీటిల్లో ఉన్నాయన్నారు. పది స్టేషన్లలో 13 స్టాల్స్, 8 స్టేషన్లలో 8 ట్రాలీలు సుమారు రూ.64.51 లక్షలతో ఏర్పాటు చేశామన్నారు. దాచేపల్లి వద్ద సిమెంట్ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రూ.130 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. తమ డివిజన్‌లో ఇప్పటి వరకు రెండు కోచ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్నా మన్నారు. 16 కిలో మీటర్ల దూరంలో సాతులూరు- మునుమాక మధ్య డబ్లింగ్, శావల్యాపురం -చీకటీగలపాలెం మధ్య డబ్లింగ్ 17 కిలో మీటర్ల మేరకు పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు.
రేపు రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం : వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
