దశ దిశ మార్చడమే లక్ష్యం

‘స్వర్ణాంధ్ర విజన్‌ 2047’ ఆవిష్కరణలో చంద్రబాబు 

పరిశ్రమలు ఎక్కడొచ్చినా రైతుల భాగస్వామ్యం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర దశ, దిశను మార్చి తెలుగు జాతిని ప్రపంచంలో ఉన్నతస్థానంలో నిలపడమే స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో స్వర్ణాంధ్ర విజన్‌ – 2047 డాక్యుమెంటును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌తోపాటు మంత్రులూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత మహిళలు, విద్యార్థులతో కొద్దిసేపు చంద్రబాబు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ మహిళా రైతులను పలకరించారు. స్టాళ్లను పరిశీలించారు. విజన్‌ డాక్యుమెంటులో భాగస్వా ములైన వారితోనూ చర్చించారు. డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆందరూ దానిపై సంతకాలు చేశారు. ఆవిష్కరణ అనంతరం సిఎం మాట్లాడుతూ దేశాన్ని అగ్రదేశంగా మార్చాలనే లక్ష్యంతో వికసిత భారత్‌ 2047ను కేంద్రం తీసుకొచ్చిందని, దానిలో భాగంగానే రాష్ట్రంలో విజన్‌ 2047 తీసుకువచ్చామని చెప్పారు. గతంలో రూపొందించిన విజన్‌ 2020 స్ఫూర్తితో 2047 రూపొందించామని తెలిపారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ, శక్తి, ఇంధనాల వ్యయ నియంత్రణ, పరిపూర్ణ ఉత్పాదకత వంటి విధానాలతో తాజా విజన్‌ రూపొందించినట్లు చెప్పారు. 2047 నాటికి తలసరి ఆదాయాన్ని 42 వేల డాలర్లకు చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని సిఎం అన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా, టెక్‌ ఇలా అన్ని రంగాల్లో ప్రపంచ మార్కెట్‌తో పోటీపడేలా ప్రత్యేక కార్యాచరణలో ముందుకు వెళుతున్నామని సిఎం చెప్పారు. టెక్నాలజీని ఉపయోగిం చుకుంటే ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు.

20 పాలసీలు కూడా
విజన్‌ డాక్యుమెంట్‌తోపాటు 20 పాలసీలను రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో రూ.20 లక్షల కోట్ల నుండి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావాలని, ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో విజన్‌ డాక్యుమెంట్‌ తెచ్చినట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ వల్ల రాష్ట్రం ఎనర్జీ హబ్‌గా తయారవుతుందని, ఇందులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలని, 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఎక్కడ పరిశ్రమలు వస్తే అక్కడ రైతులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని పేర్కొన్నారు. అమరావతి రైతులపై కేసులను విత్‌డ్రా చేసుకుంటామని చెప్పారు.

వ్యవస్థల బలోపేతంతోనే ప్రజలకు మేలు : పవన్‌ కల్యాణ్‌
వికసిత్‌ భారత్‌లో ఎపి మొదటిస్థానంలో నిలవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆందరి సహకారం అవసరమని, వ్యవస్థల బలోపేతంతో ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. శక్తి, సంపద, సమగ్రాభివృద్ధితో రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్‌ తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో సకాలంలో వైద్య సదుపాయాలు అందని గ్రామాలు 2,854 ఉన్నాయని అధికారులు చెప్పారని, గత ప్రభుత్వం దుబారాను నిలువరిస్తే 1,400 గ్రామాల్లో సదుపాయాలు కల్పించేవారమని పేర్కొన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టడంలో కార్యనిర్వాహక యంత్రాంగం కీలకమని తెలిపారు. ఒత్తిళ్లు, భయాలకు అతీతంగా అందరూ పనిచేస్తే అభివృద్ధి కష్టమేమి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, బిసి జనార్థన్‌రెడ్డి, లోకేష్‌ తదితరులు మాట్లాడారు.

➡️