‘ఉపాధి’ వేతనాలు పెంచండి

 కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ హితవు
 నిధుల విడుదలలో జాప్యంపై ఆగ్రహం
 అదనపు పని దినాలు పెంచాలని, ఆధార్‌ ఐచ్ఛికంగా ఉండాలని సూచన
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద రాష్ట్రాల్లో అమల్జేస్తున్న ‘ఉపాధి’ పథకాలకు కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుండడంపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామీణ వేతనాలపై ద్రవ్యోల్బణ వాస్తవ ప్రభావానికి అనుగుణంగా వేతన రేట్లను సవరించాలని కేంద్రానికి సూచించింది. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన వేతన రేటును వర్తింపజేయాలని సిఫార్సు చేసింది. ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 100 నుండి 150కి పెంచాలని, ఆధార్‌ ఆధారిత చెల్లింపుల పద్ధతిని ఐచ్ఛికం చేయాలని, పశ్చిమ బెంగాల్‌కు ఇవ్వాల్సిన నిధులను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని కూడా సూచించింది. కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలకా నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ (2024-25)పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ బుధవారం తన నివేదికలను లోక్‌సభకు సమర్పించింది.

వేతన రేట్లపై…
వేతన రేట్లను పెంచకపోవడంపై తాము చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నామని కమిటీ తన నివేదికలో మరోమారు గుర్తు చేసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉన్న వేతన రేట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపింది. వ్యవసాయ కార్మికుల వినియోగ ధరల సూచీతో ముడిపడిన ఉపాధి పథకం వేతనాలు ద్రవ్యోల్బణ ధోరణులను ప్రతిబింబించడం లేదని చెప్పింది. ఈ సూచీ ద్రవ్యోల్బణ వాస్తవ ప్రభావానికి అనుగుణంగా లేదని అభిప్రాయపడింది. కాబట్టి క్షేత్ర స్థాయిలో వాస్తవ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ప్రాధాన్యతా ప్రాతిపదికన వేతన లెక్కలను సమీక్షించి తాజా పరచాలని సూచించింది. ఈ పథకానికి కేంద్రం నిధులు అందిస్తున్నందున అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన వేతన రేటు ఉండేలా గ్రామీణాభివృద్ధి శాఖ పరిశీలన జరపాలని కోరింది.

వాటా చెల్లింపుపై…
ఉపాధి పథకానికి కేంద్రం తన వంతు వాటాను సకాలంలో చెల్లించకపోవడంపై  పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపింది. గ్రామీణాభివృద్ధి శాఖ అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీ నాటికి వేతనాల చెల్లింపు, సామగ్రి కొనుగోలు కింద కేంద్రం తన వంతు వాటాగా రూ.23,446.27 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఇది 27.26 శాతం. ‘కేటాయించిన నిధుల్లో నాలుగో వంతు మొత్తాన్ని గత సంవత్సరపు బకాయిల చెల్లింపులకే ఉపయోగిస్తున్నారు. అంటే ప్రస్తుత సంవత్సరపు వాస్తవ బడ్జెట్‌ను రూ.62,553.73 కోట్లకు కుదించారు. దీనివల్ల పథకం లక్ష్యాలు నెరవేరే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్రం తన వంతు వాటా మొత్తాన్ని సకాలంలో విడుదల చేయాల్సిన అవసరం ఉంది. చెల్లింపుల్లో జాప్యం జరగకుండా రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి’ అని కమిటీ సూచించింది.

ఇతర అంశాలపై…
పథకం అమలులో అవకతవకలు జరుగుతున్నాయన్న కారణంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2021 నుండి పశ్చిమ బెంగాల్‌కు నిధుల విడుదలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను అందజేయాలని కేంద్రానికి కమిటీ సూచించింది. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల పద్ధతిని తప్పనిసరి చేయవద్దని కూడా కమిటీ సిఫార్సు చేసింది. ఆధార్‌ వివరాలు, జాబ్‌కార్డు రికార్డుల్లో తేడాలు ఉన్నాయన్న సాకుతో కార్మికులను తొలగిస్తున్నారని తెలిపింది. దీనివల్ల అసలైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతోందని చెప్పింది. కమిటీ తన నివేదికలో పని దినాల పెంపునూ ప్రస్తావించింది.

➡️