‘ఉపాధి’కి నిధుల పెంపు శూన్యం

  • ఏటా కేటాయింపుల్లో కోత
  • రూ.10 వేల కోట్లు వరకూ బకాయిలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకంపై కేంద్రం మరోసారి సీతకన్నేసింది. గత రెండేళ్లుగా ఈ పథకానికి కేటాయింపులు పెంచకుండా ఉండటమే ఇందుకు నిదర్శనం. 2024-25 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.86 వేలకోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లోనూ అంతే మొత్తాన్ని కేటాయించింది. వాస్తవానికి గత ఐదేళ్లుగా ఉపాధి హామీ పథకం డిమాండ్‌ దేశ వ్యాప్తంగా పెరుగుతుంది. ఈ పథకంలో వేతనదారులు చేసిన పని దినాల సంఖ్యను పరిశీలిస్తే.. 2022-23లో 293.70 కోట్ల పని దినాలు, 2023-24లో 308.73 కోట్ల పని దినాలకు డిమాండ్‌ పెరిగింది. 2024 డిసెంబరు రెండో వారానికి 198.02 కోట్ల పని దినాలను పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన నిధులను పూర్తి స్థాయిలో కేటాయించకపోగా ఈ పథకం డిమాండ్‌ ఆధారిత పథకం అయినందున అవసరాన్ని బట్టి కేటాయిస్తామని సాకులు చెబుతుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ వేతనాలకు, మెటీరియల్‌కు రూ.10 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నిధుల కొరత కారణంగానే చెల్లించడం లేదని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రాల నుంచి కూడా ఈ పథకానికి నిధుల కోసం డిమాండ్‌ అధికంగా ఉంది. రాష్ట్రంలో ఈ పథకం కింద రూ.950 కోట్లు బకాయిలు ఉండగా, అదనపు నిధులు కోరుతూ కేంద్రానికి ఇటీవలే అధికారులు లేఖ రాశారు.
కోవిడ్‌ సమయంలో ఉపాధి పథకానికి డిమాండ్‌ దాదాపు రెట్టింపయ్యింది. అప్పటి నుంచి ఈ పథకానికి కేటాయించిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఏటా కోత వేస్తూ వస్తోంది. 2020-21లో రూ.1,11,170.86 కోట్లు కేటాయించగా, 2021-22లో రూ.98,467.84 కోట్లు, 2022-23లో రూ.90,810.99 కోట్లు, 2023-24లో రూ.89,268.30 కోట్లు, 2024-25 నవంబరు వరకూ రూ.74,976.84 కోట్లు కేటాయించారు. ఉపాధి పథకానికి కేటాయింపుల్లో కోత విషయంపై పార్లమెంట్‌లో పలు రాష్ట్రాల ఎంపిలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉపాధి పథకానికి ఏటా నిధులు కేటాయింపులు తగ్గించడంపై వారు ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, వచ్చే బడ్జెట్‌ నుంచైనా పథకానికి తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు, అయినప్పటికీ కేంద్ర ప్రభుతం ఈ అంశాన్ని పెడచెవిన పెట్టి గతేడాది కేటాయించిన రూ.86 వేల కోట్లను ఏ మాత్రం పెంచకుండా బడ్జెట్‌ రూపొందించడంపై పలు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

➡️