మాతృభాషలోనే జ్ఞానం పెరుగుదల

తెలుగు భాషా దినోత్సవంలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంగ్లీషు వస్తేనే జీవితమని గత ప్రభుత్వం చెప్పేదని, ఇంగ్లీషు వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవడం పొరపాటేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పిల్లల్లో సృజనాత్మకత, జ్ఞానం పెరగాలంటే మాతృ భాషతోనే సాధ్యమని అన్నారు. మాతృ భాషను విధ్వంసం కాకుండా ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిడుగు రామ్మూర్తి పంతులు 161వ జయంతి నేపథ్యంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు భాషను గౌరవించుకునేందుకు ప్రతి ఏడాది గిడుగు రామ్మూర్తి జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నామని, భాష లేకపోతే మనజాతి మనుగడే ఉండదని అన్నారు. మన సంస్కృతికి, సంప్రదాయాలకు మూలం మన భాష అని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అత్యధికులు తెలుగువారేనని అన్నారు. దేశంలో నాలుగో భాషగా వుంటే, అమెరికాలో 11వ భాషగా తెలుగు వుందని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం చేసి తెలుగు వారి కోసం రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అయితే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలలా చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని పోరాడి సాధించుకున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఇంగ్లీషే జీవితం అన్నట్టు వ్యవహరించి మాతృ భాషను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు చర్యలు తీసు కుంటామని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతా మన్నారు. అలాగే ప్రపంచం గర్వపడేలా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. జిఓ నెంబరు 77తో తెలుగు పండిట్లకు అన్యాయం జరుగుతోందని అధ్యయనం చేసి సరిచేస్తామని అన్నారు. గడిచిన ఐదేళ్లలో కళాకారులను పని చేయించుకుని డబ్బులు ఇవ్వని పరిస్థితి వుందన్నారు. తెలుగు కళాకారులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కూచిపూడి నృత్యానికి దేశవ్యాప్తంగా ఆదరణ ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగు మాట్లాడటం, చదవటమే పాపమైనట్లు గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. మనకు వాడుక భాషను అందించిన ఘనత గిడుగు రామూర్తిదేనని అన్నారు. పిఠాపురం రాజావారు సూర్యరాయేంద్ర వ్యాకరణానికి చెందిన ఏడు సంకలనాల పునరుద్ధరణకు ముఖ్యమంత్రి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగు భాష కోసం పనిచేసిన 17 మంది కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది.

➡️