- ఆలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీ
- సమీక్షలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అర్చకులకు వేతనం పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నెలకు రూ.10 వేలు ఉన్న వేతనం ఇకపై రూ.15 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. దేవాదాయశాఖపై సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. వేతనం పెంపు ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.10 కోట్లు భారం పడుతుందన్నారు. దూప దీప నైవేథ్యం కోసం ఆలయాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఏడాదికి రూ.32 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నవారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలన్నారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం రూ.25 వేలు వేతనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ట్రస్టు బోర్డుల్లో ఇద్దరు చొప్పున బోర్డు సభ్యులను అదనంగా తీసుకుంటామన్నారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం దేవాదాయ, అటవీశాఖ, పర్యాటకశాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయమనున్నట్లు వెల్లడించారు.
ప్రారంభం కాని పనులు నిలిపివేత
సిజిఎఫ్ కింద 243 పనులు, టిటిడి శ్రీవాణి ట్రస్టు కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1,797 పనులు ప్రారంభం కాలేదని, వాటిని నిలుపుదల చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఇప్పటికే మొదలైన పనులను పూర్తి చేయాలన్నారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేటు సెక్టారు భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి యాత్రికులకు వసతులు కల్పించాలన్నారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనరు సత్యనారాయణ పాల్గొన్నారు.