పెరిగిన ప్రత్యామ్నాయ సాగు

  • సబ్సిడీ విత్తనంపై ఆసక్తి కరువు
  • ముగియనున్న ఖరీఫ్‌ సీజన్‌

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ప్రత్యామ్నాయ పంటలే దిక్కయ్యాయి. సకాలంలో వర్షాలు పడకపోవడంతో ప్రధాన పంట వేరుశనగ సాగు నామామాత్రంగానే అయ్యింది. సాధారణ సాగులో 55 శాతంలోపే వేరుశనగ పంట సాగైంది. ప్రయత్నాయ పంటలు కొన్ని 400 శాతానికిపైగా పెరిగాయి. ప్రభుత్వమిచ్చిన సడ్సీడీ ప్రత్యామ్నాయ విత్తనాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు.

89 శాతం సాగు
ఈ ఏడాది ఖరీఫ్‌లో 3,46,732 హెక్టార్లు సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే ఖరీఫ్‌ సాగు అత్యధికం వర్షాధారమే కావడంతోపాటు సాగుకు కీలకమైన జులై నెలలో 61 శాతం వర్షపాతం లోటుంది. దీంతో ప్రధాన పంట వేరుశనగ ఆశించినంత సాగవలేదు. వేరుశనగ సాధారణ సాగు ఖరీఫ్‌లో 1,97,884 హెక్టార్లు అనుకుటంటే విత్తనం పడింది కేవలం 1,08,104 హెక్టార్లు మాత్రమే కంది పంట సాధారణ సాగు 37,367 హెక్టార్లు అయితే సాగైంది 1,00,454 హెక్టార్లు. సాధారణం కంటే 269 శాతం అధికంగా అయింది. ఇక కొర్ర పంట రికార్డు స్థాయిలో సాగైంది. సాధారణ సాగు 2001 హెక్టార్లు అయితే ఈసారి 8827 హెక్టార్లు సాగైంది. అంటే సాధారణం కంటే 441 శాతం అధికంగా కొర్ర పంట సాగైంది. సజ్జ పంట సాధారణ సాగు 1610 హెక్టార్లకుగానూ 3229 హెక్టార్లు సాగైంది. సాధారణం కంటే 201 శాతం అధికంగా అయింది. ప్రధాన పంటల్లో ఈసారి వరి సాగు బాగా పెరిగింది. సాధారణ సాగు జిల్లాలో 18,299 హెక్టార్లకుగానూ 20,789 హెక్టార్లు అయింది. సాధారణం కంటే 114 శాతం అధిక మైంది. పత్తి పంట సాధారణం కంటే తక్కువే అయింది. ఇలా ఈసారి ప్రత్యామ్నాయ పంటల సాగు పెరిగాయి. సీజన్‌లో వర్షాలు సరిగా లేకపోవడంతో ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ప్రత్యామ్నాయ విత్తన పంపిణీని ప్రారంభించింది. అనువైన సమయంలో పంపిణీ ప్రారంభం కాలేదు. దీంతో రైతులు బయటే వీటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది 27,907 క్వింటాళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు జరిగిన ప్రత్యామ్నాయ విత్తనాల అమ్మకాలు చూస్తే కేవలం 4984 క్వింటాళ్లు మాత్రమే. నాలుగో వంతు మాత్రమే సబ్సిడీ విత్తనాలను రైతులు తీసుకున్నారు. ఇక ఈ వారంలో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి రబీ ప్రారంభం కానుంది. దీంతో ప్రత్యామ్నాయ విత్తన పంపిణీ కూడా పూర్తవనుంది.

➡️