- అందుకునేందుకు సిద్ధంగా విద్యుత్ సంస్థలు
- సిఎస్ విజయానంద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. డిమాండ్‌ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు విద్యుత్ సంస్థలు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు విజయవాడలోని విద్యుత్ సౌధలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ సార్వభౌమ రాజ్యాంగ తత్వవేత్త అని అన్నారు. సమాజ పునర్నిర్మానం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంలో అంబేద్కర్ ఆలోచలను అమలు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 28న రాష్ట్రంలో అత్యధికంగా 256.8 మిలియన్ యూనిట్లు (ఎంయు) వినియోగం నమోదైందని తెలిపారు. జనవరి నుంచి మార్చి వరకు వినియోగం 20,498 ఎంయుకు చేరిందన్నారు. గతేడాది ఇదే సమయానికి 20,475 ఎంయు వినియోగంచామన్నారు. రాబోయే నెలల్లో రోజువారీ వినియోగం 260 ఎంయులకు చేరే అవకాశం ఉందని, కావున విద్యుత్ సంస్థలు మరింత సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. వివిధ రకాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో జెఎమ్‌డి కీర్తి చేకూరి, జెన్‌కో ఇన్‌ఛార్జి డైరెక్టర్ ఎం సుజరుకుమార్, ఎపిఎస్‌ఇబి ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.