సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె

Jan 10,2025 22:10 #Indefinite, #issues, #not resolved, #strike
  • ఏలూరు డిసిసిబి వద్ద సొసైటీ ఉద్యోగుల ధర్నా

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని ఎపిస్టేట్‌ అగ్రికల్చరల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.అజరుకుమార్‌, రాష్ట్ర కార్యదర్శి కె.సత్యనారాయణ హెచ్చరించారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం ఏలూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ (డిసిసిబి) వద్ద జరిగిన ధర్నాలో వారు ప్రసంగించారు. ఈ ధర్నాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు పాల్గొన్నారు. సొసైటీ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, గ్రాట్యూటీ చెల్లించాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, సొసైటీల ప్రయివేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, సిబ్బందిని కుదించే ఆలోచన మానుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా అజరుకుమార్‌, సత్యనారాయణ మాట్లాడుతూ.. 2019లో జారీ చేసిన జిఒ నంబర్‌ 36ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. డిసిసిబి, ఆప్కాబ్‌ తమ వంతు నిధులు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిఎసిఎస్‌లకు డివిడెంట్లు ఇవ్వకుండా, సిబ్బంది వేతనాల ఖర్చుల్లో తమ వాటాలు భరించకుండా డిసిసిబి, ఆప్కాబ్‌ కాలక్షేపం చేస్తున్నాయని విమర్శించారు. 2019, 2024 వేతన సవరణ వెంటనే చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. 2019 తర్వాత చేరిన వారిని తొలగించరాదని విజ్ఞప్తి చేశారు. గతంలో వైసిపి ప్రభుత్వం చేసిన సవరణలను టిడిపి అధికారంలోకి వచ్చినా వాటిని రద్దు చేయకుండా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. సహకార వ్యవస్థను ప్రయివేటుపరం చేసేందుకు మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రయత్నిస్తోందని, ఆ విధానాలనే రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు కూడా అమలు చేస్తూ సహకార సంఘాలకు ఎసరుపెట్టే ఆలోచన చేస్తున్నారని అన్నారు. సహకార సంఘాలను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్‌ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్‌, కార్యదర్శి కృష్ణశాస్త్రి, ఏలూరు జిల్లా అధ్యక్షులు కెవివి.సత్యనారాయణ, కార్యదర్శి పి.సుబ్బారావు, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సిహెచ్‌.వెంకటేశ్వరరావు, సిఐటియు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శులు డిఎన్‌విడి.ప్రసాద్‌, కె.రాజారామ్మోహన్‌రారు, జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు ప్రసంగించారు. ధర్నా అనంతరం సిఇఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఇఒ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

➡️