సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌దే విజయం : ముప్పాళ్ళ

ప్రజాశక్తి-మంగళగిరి : దేశ వ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ వేదిక విజయం ఖాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. గురువారం మంగళగిరి సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బిజెపికి ఎదురుగాలి వీస్తుందని, ప్రధాని మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తూ దేశ ప్రజలను మతాలవారీగా చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రంలో ఇండియా బ్లాక్‌ వేదిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలు మొత్తం బిజెపి కేంద్రంలో ప్రభుత్వం పెట్టిన విధానాలను బలపరుస్తూ రాష్ట్రంలో ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలన చేస్తుందని విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టో ఐదు సంవత్సరాలలో అమలు చేయలేదని విమర్శించారు. మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి, నిషేధించలేదని అన్నారు. టిడిపి బిజెపితో స్నేహం చేయడం వలన రాష్ట్రంలో టిడిపి కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. మంగళగిరి అసెంబ్లీకి సిపిఎం తరఫున పోటీ చేస్తున్న జొన్న శివశంకరరావును, గుంటూరు పార్లమెంటుకు సిపిఐ తరఫున పోటీ చేస్తున్న జంగాల అజయ్ కుమార్‌లను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నియోజవర్గ నాయకులు జాలాది జాన్‌ బాబు, వై వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️