2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ : సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ : 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ …. ఏఐ సాంకేతికతలో భారత్‌ ముందుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మార్మోగుతోందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులున్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పన్ను సంస్కరణల్లో చాలా మార్పులు జరిగాయని తెలిపారు.

విద్యుత్‌ రంగంలో సంస్కరణలు ప్రథమంగా ఏపీలోనే : చంద్రబాబు
విద్యుత్‌ రంగంలో సంస్కరణలు ప్రథమంగా ఏపీలోనే జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ పాలసీ గేమ్‌ఛేంజర్‌గా మారబోతోందన్నారు. దేశంలో పెట్టుబడులకు చాలా మంది ముందుకొస్తున్నారని తెలిపారు. పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతోందని, వఅద్ధిరేటు పెంచేలా ఈ బడ్జెట్‌ ఉందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యవేత్తల్లో భారతీయులే ప్రముఖంగా ఉంటున్నారని అన్నారు.

ఢిల్లీ పరువును ఆమ్‌ఆద్మీ పార్టీ బజారుకు ఈడ్చింది : చంద్రబాబు
ఢిల్లీ పరువును ఆమ్‌ఆద్మీ పార్టీ బజారుకు ఈడ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం విధానాలు సరిగ్గా లేవని ఆరోపించారు. ఒకప్పుడు జనం ఢిల్లీకి వచ్చే వారని.. ప్రస్తుతం ఇక్కడున్న వారే ఇతర ప్రాంతాలకు వలస వెళుతుండటం బాధాకరమన్నారు. ఢిల్లీలో వాయు, రాజకీయ కాలుష్యంతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా లిక్కర్‌ స్కాంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఉండటంతో ఢిల్లీ పరువు కాస్త పోయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతో అవసరం అని చంద్రబాబు అన్నారు.

కమ్యూనిజానికి కాలం చెల్లింది : చంద్రబాబు
స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ లక్ష్యం కూడా వికసిత్‌ భారత్‌లో భాగమేనని చంద్రబాబు తెలిపారు. ప్రపంచలో ఎక్కడైనా భారతీయులకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌ దేశాన్ని సమ్మిళిత ఆర్థిక వృద్ధి వైపు తీసుకెళుతోందన్నారు. 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని సంతోషం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఢిల్లీ లో అభివృద్ధి కుటుంబడిందని ఎద్దేవా చేశారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి అనేది ఎన్డీఏ ప్రభుత్వ విధానమని అన్నారు. ఎవరికి ఓట్లు వేస్తే అభివృద్ధి జరుగుతుందో ఢిల్లీ ప్రజలు ఆలోచించాలని కోరారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు.. దేశ ప్రగతికి మలుపు అని సీఎం చంద్రబాబు చెప్పారు.

➡️