కుల వివక్షపోతేనే భారత్‌ శక్తివంతం

  • తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం : రాహుల్‌ గాంధీ

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : దేశంలో కుల వివక్షతను నిర్మూలిస్తేనే ఆర్థికంగా భారతదేశం శక్తివంతమవుతుందని ఎఐసిసి అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక ఎదుగుదలకు అంటరానితనమే పెద్ద ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన కులగణన సదస్సులో రాహుల్‌గాంధీ మాట్లాడారు. అన్ని వ్యవస్థల్లోనూ కులవ్యవస్థ పాతుకుపోయిందనీ, దానికి న్యాయ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు కూడా అతీతం కాదని స్పష్టం చేశారు. ఈ నిజాలు ప్రధాని మోడీకి తెలిసినా బయటకు రానివ్వకుండా దాచిపెడుతున్నారని విమర్శించారు. అసమానతల భారతంలో ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారని ప్రశ్నించారు. కులగణనతో ఎవరి వద్ద ఎంత ఆస్తి ఉందో తేలుతుందనీ, ఆ సంపద అందరికీ సమానంగా పంపిణీ జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న కులగణన కార్యక్రమం దేశానికి రోల్‌ మోడల్‌గా కాబోతున్నదని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. అంతకు ముందు మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. 250 మంది ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా?’ అని ప్రశ్నించారు. కులగణన ద్వారా దళితులు, ఒబిసిలు, ఆదివాసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. ఇది కులగణన కాదనీ, ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకుపోవాలో మార్గనిర్దేశం చేస్తాయన్నారు. కులాల వారీగా జనాభా లెక్కిస్తే తరాలుగా నష్టపోతున్న వారికి తగిన ప్రాతినిధ్యం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️