‘న్యాయం’ కావాలి..  కొనసాగిన వెటర్నరీ విద్యార్థుల దీక్ష

ప్రజాశక్తి – ఎస్‌వియు క్యాంపస్‌ : ‘న్యాయం కావాలి’ అంటూ వెటర్నరీ వైద్య విద్యార్థులు తమ దీక్షలను కొనసాగిస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున పోరాట స్ఫూర్తిని చాటారు. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో ఉపకార వేతనాలు, ఇతర వైద్య విద్య కోర్సులతో సమానంగా తమకు స్టైఫండ్‌ పెంచాలని కోరుతూ చేస్తున్న నిరసన దీక్షలు శనివారం 34వ రోజుకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పశువైద్య విద్యార్థులు నల్ల వస్త్రాలు ధరించి, నల్ల మాస్కులతో వినూత్నంగా నిరసన తెలిపారు. మహిళా దినోత్సవం జరుపుకోవడంలేదని ఇంతమంది సమ్మె నిర్వహిస్తుంటే ఏ ఒక్క అధికారి నుంచి స్పష్టమైన హామీ లేకపోవడం బాధాకరమని విద్యార్థినులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య కళాశాల విద్యార్థులు నీలిమ, ప్రవీణ, పురుషోత్తం, యుగంధర్‌, పవన్‌ పాల్గొన్నారు.

➡️