ఆరు జిల్లాలపై సర్కారు ఫోకస్
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అసైన్డ్ ,ఇనామ్ భూముల క్రమబద్దీకరణలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో విచారణ కమిటీలను ఏర్పాట చేయాలని, మెంబర్లుగా అసిస్టెంట్ రిజిస్ట్రార్, /తహసీల్ధార్/ ఒక మండల సర్వేయర్‌ను నియమించాలని ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల్లో ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని, ఆ కమిటీ అక్కడ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఫిర్యాదులు వస్తే వాటిని పరిష్కరించాలని సూచించింది. నెల రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్రనివేదిక అందచేయాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక భూ బదలాయింపులు జరిగిన జిల్లాలుగా తిరుపతి, చిత్తూరు, వైఎస్‌ఆర్, అన్నమయ్య, ప్రకాశం, శ్రీసత్యసాయి జిల్లాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాలపై కేంద్రీకరించే తాజాగా విచారణ ప్రక్రియను నిర్వహించనున్నారు. గత ఐదేళ్ళకాలంలో అసైన్డ్, 22(ఎ), ఇనామ్ భూములు 13.59లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి ఆయా భూముల యజమానులకు భూ యాజమాన్యపు హక్కులును గత ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో 25,230 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాయి. తాజాగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిషేధిత భూములను ప్రీ హోల్డ్ చేస్తూ యాజమాన్యపు హక్కులు కల్పించిన ఫైళ్లు అగ్నికి ఆహుతి కావడం, ఓ మాజీ మంత్రి అనుచరుల ఇళ్లలో ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరకడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ ల్యాండ్స్ 36,36,749 ఎకరాలు ఉన్నాయని రెవిన్యూశాఖ నిర్ధారించింది. ఇప్పటి వరకు అందిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా భూ యాజమాన్యపు హక్కులు 9,93,285 ఎకరాలకు కల్పించారు.
వీటితో పాటు గ్రామ సర్వీసు ఇనామ్ ల్యాండ్1,38,848 ఎకరాలు, చుక్కల భూములు 1,94,232 ఎకరాలు, షరతులగల పట్టా భూములు 33,441 ఎకరాలు కలిపి మొత్తం 13,59,806 ఎకరాల భూములకు గత ఫ్రభుత్వం భూ యాజమాన్యపు హక్కులు కల్పించింది. ఫ్రీ హోల్డ్ జరిగిన భూముల్లో అత్యధిక శాతం వైసిపి నేతలు, వారి అనుచరులు, నేతల బినామీలకు చెందిన భూములుగా ప్రభుత్వం భావిస్తోంది.
అత్యధికంగా ప్రీ హోల్డ్‌్ చేసిన జిల్లాలు, భూముల విస్తీర్ణం వివరాలు:
జిల్లా పేరు ఎలిజిబుల్ అసైన్డ్ ల్యాండ్ ఫ్రీహోల్డ్ చేసిన భూమి(ఎకరాలు గ్రామ సర్వీస్ ఇనామ్ ల్యాండ్ చుక్కల భూమి షరతుల గల పట్టా భూమి ప్రీహోల్డ్ చేసిన మొత్తం భూమి(ఎకరాలు)
తిరుపతి 96,275 69,012 2,308 7,832 18 79,169
చిత్తూరు 1,90,545 1,59,328 359 990 0 1,60.677
వైఎస్‌ఆర్ 99,843 30,938 26,623 18,559 200 76,321
అన్నమయ్య 1,41,478 1,26,227 4818 28,882 2514 1,62.442
ప్రకాశం 1,74,934 1,39,063 9,525 37,622 77 1,86,286
శ్రీసత్యసాయి 2,51,214 2,29,448 5943 22,011 91 2,57.042
