- రెవెన్యూశాఖ పనితీరు, ప్రజల సంతృప్తిపై థర్డ్ పార్టీ ఆడిట్ శ్రీ సమీక్షలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నిబంధనలకు విరుద్ధంగా 7,827 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేపట్టాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రెవెన్యూశాఖపై సచివాలయంలో సిఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెనుకొండ, నందలూరు, వెదురు కుప్పం, ధర్మవరం, వీరబల్లి, సోమందేపల్లి, ఏర్పేడు, దోర్నాల, రొద్ద, రామాపురం మండలాల్లో ఫ్రీ హోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు అత్యధికంగా జరిగా యని, వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,21,433 ఎకరాల్లో ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన నిబంధనల ఉల్లంఘనలను కూడా తేల్చాలన్నారు. ప్రజలు సులభంగా రెవెన్యూ సేవలు పొందేందుకు అవసరమైన ప్రక్షాళన చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఏ తరహా ఫిర్యాదును ఎలా పరిష్కరిస్తున్నారు? ఎంత సమయం తీసుకుంటున్నారు? ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతుందా అనే అంశాలపై థర్డ్‌్ పార్టీ ద్వారా ఆడిట్ చేయాలని సిఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని, ఆన్‌లైన్‌లో అన్ని సర్వీసులూ అందుబాటులోకి రావాలని అన్నారు. రెవెన్యూశాఖ సమూల ప్రక్షాళనతోపాటు కఠిన నిర్ణయాల ద్వారా ప్రజల ఇబ్బందులను తగ్గించా లన్నారు. భూములు బలవంతంగా లాక్కునేందుకు 22-ఎలో పెడతామని బెదిరించి చేసిన కబ్జాలు అనేకం ఉన్నాయని, వాటిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో 13,59,805 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌్ చేశారని, వీటిలో 4,21,433 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసినట్లు అధికారులు గుర్తించారన్నారు. ఇందులో 25,284 ఎకరాలు రిజిస్ట్రేషన్లు కాగా, అందులో 7,827 ఎకరాలు రిజిస్ట్రేషన్స్‌లో నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పుట్టిన తేదీ, మరణించిన తేదీ, కులం, ఆదాయం వంటి సర్టిఫికెట్లు వంటి సర్వీసుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సేవలు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. 1,74,720 అర్జీలు రాగా, అందులో 67,928 అర్జీలు కేవలం రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయన్నారు. మొత్తం అర్జీల్లో 1,32,572 పరిష్కరించగా, అందులో 49,784 అర్జీలు పరిష్కరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. భూముల రీ సర్వే గురించి సిఎం మాట్లాడుతూ.. 16,816 గ్రామాలకు, 6,698 గ్రామాల్లో 85 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తయిందని, రీసర్వేలో తప్పులపై ప్రజల నుంచి 2,79,148 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. వీటిని పరిష్క రించడంతోపాటు రీసర్వే జరుగుతున్న గ్రామాలతోపాటు రీసర్వే మొదలు కాని గ్రామాల్లో కూడా పారదర్శకంగా సమస్యలు తలెత్తకుండా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లా డుతూ.. వైసిపి ప్రభుత్వం 77,98,516 సరిహద్దు రాళ్లు నాటి సిఎం బొమ్మలతో ముద్రించిందని, కూటమి ప్రభుత్వం వీటిని తొలగించే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు 4,40,651 రాళ్లపై బొమ్మలను తొలగించామన్నారు. ఒక్కో బొమ్మ తొలగింపునకు రూ.15 ఖర్చవుతోందని, అన్ని రాళ్లపై బొమ్మలు తొలగించేందుకు రూ.12 కోట్లు ఖర్చవుతుందని మంత్రి వివరించారు. జనవరి నాటికి ఈ పనిని పూర్తి చేస్తామన్నారు.