ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టడీయల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. రఘురామ కస్టడీయల్ టార్చర్ కేసులో ఎలాంటి గాయాలు లేవని గతంలో డాక్టర్ ప్రభావతి నివేదిక ఇచ్చారు. విచారణకు సహకరించడం లేదని గత విచారణ సందర్భంగా కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ నెల 7, 8 తేదీల్లో దర్యాప్తునకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించకపోతే, మధ్యంతర ఉపశమనం రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో ప్రభావతి విచారణకు హాజరయ్యారు. ఆమె విచారణకు హాజరైన అనంతరం పిటిషన్ తొలిసారి విచారణకు వచ్చింది. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేశారు.
