- మరోసారి చర్చనీయాంశమైన చించినాడ
- ఆర్‌ఎస్ స్ఫూర్తితో పేదల విజయం
ప్రజాశక్తి – కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : గోదావరి జిల్లాల్లో చించినాడ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది కమ్యూనిస్టులే. స్వాతంత్రోద్యమ సమయంలోనూ, స్వాతంత్య్రం వచ్చాక కూడా అగ్రవర్ణ పెత్తందారీ భూస్వాములతో ఢ అంటే ఢ అంటూ పేదల పక్షాన కమ్యూనిస్టులు, ప్రధానంగా స్వాతంత్య్రం వచ్చాక సిపిఎం ఆధ్వర్యాన సాగిన పోరాటాలు చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలుగా చెప్పుకోవచ్చు. ఆ పోరాటాల నేపథ్యమే ఆ గ్రామం పోరాటాల పురిటిగడ్డగా పేరొందడంతోపాటు స్థానిక సంస్థలన్నింటిలో సిపిఎం నేతలే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారని చెప్పొచ్చు. పెద్దఎత్తున సాగిన వర్గపోరులో సిపిఎం నేతలు భూస్వాముల చేతిలో హత్యకు గురైన గడ్డ చించినాడ. ఆ దాడులను, హత్యలను ప్రతిఘటించి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఆ గ్రామానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు, మాజీ ఎంఎల్‌ఎ ఆర్.సత్యనారాయణరాజు (ఆర్‌ఎస్) పాత్ర ఎనలేనిది. ఆయన వెంట ఉండి ఉద్యమాన్ని ముందుకు నడిపిన వారిలో కేతా సూర్యారావు ముఖ్యులు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని మేజర్ గ్రామం చించినాడ.
అదే తరహాలో తీవ్ర నిర్బంధం నడుమ ఇటీవల చించినాడలో పేద దళితులు, బిసిలు సాగించిన పెరుగులంక భూపోరాటం చించినాడ పేరును మరోసారి మార్మోగించింది. సుమారు 800 కుటుంబాలు తమ అధీనంలో ఉన్న భూములను రక్షించుకోవడం కోసం సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ఆరు నెలలపాటు సమరశీల పోరు సాగింది. ఆ భూములు మళ్లీ పేదలకు కేటాయిస్తూ అధికారులు పట్టాలిస్తుండటం సిపిఎం పోరాటాల ఫలితమేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఆ పోరులో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆ గ్రామానికి చెందిన సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు ఆ పార్టీ 27వ రాష్ట్ర మహాసభకు ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి ఆయనను పలుకరించగా, పెరుగులంక భూముల పోరాట వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
చించినాడలో పేద దళితులు, బిసిల పోరాట ఫలితంగా గోదావరి లంక భూముల్లో సాగు చేసుకునేందుకు 1983లో అప్పటి ప్రభుత్వం 40 ఎకరాలకు డి.ఫారం పట్టాలిచ్చింది. నాటి నుంచి పేదలు ఆ భూముల్లో చెరువులు తవ్వుకుని ఆక్వా సాగు చేసుకుంటున్నారు. కాలక్రమంలో గోదావరి ప్రవాహం రీత్యా ఆ లంక భూములకు ఆనుకుని లంక భూములు మరో 20 ఎకరాలకు విస్తరించాయి. ఆ భూములను సైతం చించినాడలోని పేదలు సాగు చేసుకోవడానికి పట్టాలివ్వాలని అధికారులను కోరి సాగు ప్రారంభించారు. ఆ భూములపై వైసిపి పెద్దల కన్ను పడింది. పేదలను అక్కడి నుంచి తరిమేసే లక్ష్యంతో డి.ఫారం పట్టాభూముల్లో వేరే వారు సాగు చేస్తున్నారంటూ మొత్తం 60 ఎకరాల్లోనూ సాగును అధికారులు అడ్డుకున్నారు. ఆపై జగనన్న ఇళ్ల కాలనీలకు మట్టి తోలకం పేరుతో ఆ లంక భూముల్లో మట్టి తవ్వకం ప్రారంభించారు. దీనిపై పేదలు హైకోర్టును ఆశ్రయించగా, మట్టి తవ్వకాలు ఆపాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ జిల్లా అధికారులు, వైసిపి ప్రజాప్రతినిధులు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మట్టి తవ్వకాలను సాగించారు. దీనిపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, జిల్లా నేతలు బి.బలరాం, కవురు పెద్దిరాజు, కేతా సూర్యారావు నేతృత్వంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టగా నిరాక్షిణ్యంగా పోలీసులు విరుచుకుపడి శ్రీనివాసరావు, బలరాంతోపాటు సుమారు వందమందిని అరెస్టు చేసి ఆ రోజు రాత్రి వరకూ నేతలను వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పుతూ హైడ్రామా సాగించారు. ఎక్కడికక్కడ నిరసనలు వెల్లువెత్తడంతో రాత్రికి విడుదల చేశారు. ఖాకీల దాడిలో సిపిఎం కార్యకర్తలు పల్లేరు శ్రీను, కానేటి బాలరాజు, కె.ప్రియాంక, రాపాక బొజ్జమ్మ, తెన్నేటి స్టాలిన్ తదితరులకు గాయాలవ్వడంతో పోలీసులే ఆసుపత్రికి తరలించారు. ఈ తరహాలో సుమారు ఆరు నెలలపాటు పోలీసుల నిర్బంధం పెద్దఎత్తున సాగింది. నిర్బంధాలు ఆ గ్రామస్తులకు కొత్తకాకపోవడంతో ధీటుగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఎంఎల్‌ఎగా ఉన్న నిమ్మల రామానాయుడు ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. టిడిపి, జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. వివిధ దళిత, ప్రజాసంఘాలు సైతం మద్దతు పలికాయి. పౌరహక్కుల సంఘం నేతలు నిజ నిర్ధారణ పర్యటన చేశారు. ఫలితంగా అధికారులు వెనక్కుతగ్గారు. అప్పటికీ వైసిపి నేతల ఒత్తిడి తగ్గకపోవడంతో కొందరు సెలవుపై వెళ్లిపోయారు. చించినాడ పేదల సమరశీల పోరాటాల ఫలితంగా మట్టి తవ్వకాలను ప్రభుత్వం నిలిపివేసింది. కామ్రేడ్ ఆర్‌ఎస్, కామ్రేడ్ కేతా సూర్యారావు, అమరవీరుల స్ఫూర్తితో సాగించిన ఈ పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పాత 40 ఎకరాలతోపాటు కొత్తగా ఏర్పడిన 20 ఎకరాల లంక భూములకు సంబంధించి పేదలకు పట్టాలివ్వడం ప్రారంభించింది. తద్వారా చించినాడ పోరాటం మరోసారి విజయపతాకం ఎగురవేయడంతోపాటు జిల్లాలోని పేదలకు, పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.