- రాయలసీమ సిఐటియు ప్రాంతీయ వర్క్‌షాపులో ఎంఏ.గఫూర్
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కార్మిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన బాలానందన్ అడుగుజాడల్లో పయనించి కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ.గఫూర్ సూచించారు. రెండురోజులపాటు కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాలులో నిర్వహించే సిఐటియు ప్రాంతీయ వర్క్‌షాపును ఆయన శనివారం ప్రారంభించారు. ముందుగా ఉమ్మడి కర్నూలు జిల్లా సిఐటియు సీనియర్ నాయకులు తోట మద్దులు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇ.బాలానందన్ శతజయంతి సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్. రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. బాలానందన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎంఏ.గఫూర్ మాట్లాడుతూ…కార్మికవర్గ ప్రయోజనాల కోసం బాలానందన్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. 1940లో కేరళలోని అల్యూమినియం పరిశ్రమలో కార్మిక జీవితం ప్రారంభించి, తరువాత జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ, పారిశ్రామిక ప్రాంతమంతటా కార్మికులను సంఘటితం చేసి కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో ముందుండేవారన్నారు. 1944లో అల్యూమినియం ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడంలో బాలానందన్ చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో బాలానందన్ మూడుసార్లు అరెస్టు అయ్యారని, ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారన్నారు. 1953లో జాతీయ స్థాయిలో జరిగిన సమ్మెకు దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగుల సమీకరణలో బాలానందన్ అత్యంత కీలకమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. 1967 నుంచి 1968 వరకు, 1970 నుండి 1976 వరకు కేరళ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా, 1980లో లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. పార్లమెంటరీ కమిటీలలో కార్మికవర్గ ప్రయోజనాల కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. 1972లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.అంజిబాబు, కడప జిల్లా కార్యదర్శి మనోహర్, నంద్యాల జిల్లా కార్యదర్శి ఎ.నాగరాజు, అనంతపురం జిల్లా అధ్యక్షులు నాగమణి, సత్యసాయి జిల్లా కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.