మహనీయుల వర్థంతి సందర్భంగా డివైఎఫ్‌ఐ నివాళి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యువతకు స్ఫూర్తిగా నిలిచిన, పోరాట యోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ స్ఫూర్తితో వారం రోజులపాటు యువ చైతన్య కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు డివైఎఫ్‌ఐ వెల్లడించింది. వీరి 94వ వర్థంతి ఈ నెల 23న నిర్వహించనున్నామని, ఈ సందర్భంగా 22 నుంచి డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన డ్రగ్స్, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాము, జి రామన్న తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ‘డ్రగ్స్‌కు పాతర-డివైఎఫ్‌ఐ బాటరా’, ‘అవినీతిపై యుద్ధం- డివైఎఫ్‌ఐ సిద్ధం’, ‘నిరుద్యోగంపై సమరం-డివైఎఫ్‌ఐ నినాదం’తో… సేవ, శ్రమదాన, రక్తదాన శిబిరాలు, కాగడాల ర్యాలీలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు, సదస్సులు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని, యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నికలకు ముందు యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే ప్రతినెలా నిరుద్యోగ భృతిని ఇస్తామన్న పాలకులు బడ్జెట్‌లో ఆ అంశాన్నే ప్రస్తావించలేదన్నారు. దేశంలో అభివృద్ధి కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉందని, కోట్లాది మంది కొనుగోలు శక్తి లేక తీవ్రంగా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిచనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ పేరుతో డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదలలో జాప్యాన్ని నివారించాలని కోరుతూ పోరాటం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి కృష్ణ, ఉపాధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, నోహిత్ కృష్ణ, బసవ, డిఎస్‌సి సాధన కమిటీ నాయకులు రఘు, రామకృష్ణ, పోలీస్ కానిస్టేబుల్ జెఎసి నాయకులు నాగార్జున శంకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
