ప్రజాశక్తి -భీమునిపట్నం (విశాఖపట్నం) : ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్‌గా వచ్చిన ఉపాధ్యాయుడు మృతి చెందారు. కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా భీమునిప్నటం మండల కేంద్రంలో రేఖవానిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా డిబిఎన్ మాధవరావు (55) పనిచేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో సోమవారం ఇన్విజిలేటర్‌గా ఆయన విధులకు హాజరయ్యారు. ఉదయం 7.30 గంటలకు కళాశాలకు వచ్చిన ఆయన ఎఫ్‌ఆర్‌ఎస్‌యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకున్నారు. ఇన్విజిలేటర్‌గా రూము కేటాయింపునకు లాటరీ ప్రక్రియ ప్రారంభం అవుతుండగా మాధవరావు ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఎస్ రామ్మూర్తి, డిపార్ట్‌మెంటల్ అధికారి వైవి అప్పారావు ఇచ్చిన సమాచారంతో మాధవరావు కుమారుడు అంబులెన్స్‌లో సంగివలసలోని అనిల్ నీరుకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే పరిస్థితి విషమించి ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉపాధ్యాయుని మృతితో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, ఆయన పని చేస్తున్న పాఠశాలలో విషాదఛాయలు అలముకున్నాయి.
