- రూ.44 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్ : అంతర్రాష్ట్ర దొంగలను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.44 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎస్‌పి ప్రతాప్‌శివకిషోర్ శనివారం విలేకర్లకు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో, నూజివీడు రూరల్ పరిసర ప్రాంతాల ఇళ్లల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. పెదవేగి పోలీస్‌స్టేషన్ పరిధిలో, చాట్రాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలు చోటు చేసుకున్నాయి. కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చింతలపూడి ప్రాంతానికి చెందిన యువకుడు కొప్పుల నాగపుల్లారావు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ప్రాంతానికి చెందిన యువకుడు బేలూరి హిమకర్ (చైతన్య)ను పోలీసులు నిందితులుగా గుర్తించారు. వీరిపై తెలుగు రాష్ట్రాల్లో 28 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి 590 గ్రాముల బంగారు ఆభరణాలు, 1630 గ్రాముల వెండి వస్తువులు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.60 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వీటి విలువ రూ.44.20 లక్షలు ఉంటుందని, అత్యాధునిక పరిజ్ఞానం ఆధారంగా ఇరువురు నిందితులను అరెస్టు చేశామని ఎస్‌పి తెలిపారు.