- ఉద్యోగాలు పొందినవారి వివరాలతో పోర్టల్
- ఎస్‌ఐపిబి సమావేశంలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమో, ఆ పెట్టుబడులు క్షేత్రస్ధాయిలో కార్య రూపం దాల్చడం కూడా అంతే ముఖ్యమని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో గురువారం సిఎం అధ్యక్షతన 5వ ఆంధ్రపదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ( ఎస్‌ఐపిబి) సమావేశం జరిగింది.ఈ సమావేశంలో 17 సంస్ధల పెట్టుబడులకు ఎస్‌ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఏదైనా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడే ఆ సంస్ధ ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందనే తేదీపై స్పష్టత తీసుకోవాలని సూచించారు. ఐఅండ్‌సి, పుడ్ ప్రాసెసింగ్, ఐటి, ఎనర్జీ రంగాల్లో పెట్టు బడులు వస్తున్నాయన్నారు. తాజా ప్రతిపాదనల తో రూ.31,167 కోట్ల పెట్టుబడులు, 32,633 మంది కి ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని సంస్దలు ఉత్పత్తులను ప్రారంభిం చాయి? ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయనేది వివరణాత్మకంగా రానున్న ఎస్‌ఐపిబి సమావేశంలో రిపోర్టు ఇవ్వాలని సిఎం అధికారులను ఆదేశిం చారు. ఏ సంస్థ ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చిందనే వివరాలతో పోర్టల్ కూడా రూపొందించాలన్నారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఐటి కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూ కేటాయింపులు జరిపేలా చూడాలని సిఎంను కోరారు. భూములు తక్కువ ధరకు ఇవ్వడం ద్వారా మరిన్ని ఐటి కంపెనీలను ఆకట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. లోకేష్ ప్రతిపాదనపై స్పందించి న సిఎం అందుకు తగ్గట్టు ఐటి పాలసీని సవరించి తీసుకురావాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన 5 ఎస్‌ఐపిబి సమావేశాల్లో 57 సంస్ధలకు సంబంధించి రూ.4,71,188 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని, గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 5ఎస్‌ఐపిబి సమావేశాలు నిర్వహించిందన్నారు.