- నకిలీ రైతులు, డాక్యుమెంట్లు ఫోర్జరీ
- 30 మందిపై కేసు,11 మంది అరెస్టు : ఎస్‌పి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల నుంచి నకిలీ రుణాలు పొందిన, వారికి సహకరించిన 30 మందిపై గుంటూరు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఒక రిటైర్డు తహశీల్దార్‌తో సహా 11 మందిని అరెస్టు చేశామని, ఇంకా 19 మందిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్‌పి సతీష్‌కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు సొసైటీతోపాటు పలు సొసైటీల ద్వారా రూ.5 కోట్ల వరకు నకిలీ రుణాలు ఇచ్చారని తెలిపారు. రైతుల పేరు మీద పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లను నకిలీవి సృషించి క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులంతా వాటాలు పంచుకుని నకిలీ రుణాలు ఇచ్చారని తెలిపారు.
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పశ్చిమ వీరాయాపాలెం గ్రామానికి చెందిన ఉన్నగిరి. లింగేశ్వరరావు పేరు మీద చిన్నకొండ్రుపాడు ప్రాథమిక వ్యవసాయ కోపరేటివ్ సొసైటీలో రూ.6 లక్షలు రుణం తీసుకున్నట్టు తెలుసుకుని గత ఏడాది సెప్టెంబరు 18న ఫిర్యాదు చేయగా ఈ కుంభకోణం వెలుగుచూసిందన్నారు. రుణమాఫీ పథకాన్ని ఉపయోగించుకుని నకిలీ రైతులను సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. 30 మంది నిందితులను గుర్తించామని, వీరిలో 11 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మండ్రు సీతారామాంజనేయులు అనే వ్యక్తి నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తారని, ఆవుల తిరుపతిరెడ్డి ఆధార్ కార్డులో అడ్రస్‌లు పాన్ కార్డులను క్రియేట్ చేస్తారని, నకిలీ రైతులను తిరువీధుల యోగయ్య, తురుమెల్ల వెంకట సందీప్ సమకూరుస్తారని తెలిపారు. మాచవరం మాజీ తహశీల్దార్ గర్నేపూడి లేవి, ప్రతిపాడు సహకార సంఘం మాజీ బ్రాంచ్ మేనేజరు బొల్లినేడి రవికుమార్ నిందితులకు సహకరించారని వెల్లడించారు. అరెస్టైన వారిలో సోమేపల్లి నాగరాజు, జిల్లెళ్లమూడి ప్రభాకర్, తిరువీధుల యోగయ్య, ముండ్రు సీతా రామాంజనేయులు, సుంకర వెంకటేశ్వర్లు, తురుమెళ్ల వెంకట సందీప్ కుమార్, ఎ సందీప్, నేమలపురి శ్రీనివాసరావు, మానం నాగేశ్వరరావు, బత్తుల లక్ష్మీ నారాయణ, ఆవుల తిరుపతి రెడ్డి, గర్నపూడి లేవీని అరెస్టు చేసినట్టు ఎస్‌పి వివరించారు.