Mining: యురేనియం కోసమేనా…?

Aug 17,2024 00:50 #Kasulavada Mining

కుసులవాడ మైనింగ్‌పై అనుమానాలు
ప్రజాశక్తి – అమరావతి : విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుసులవాడలో మైనింగ్‌ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు ఇవ్వడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి తెల్లమెట్ట కొండలో క్వార్టజైట్‌ ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయని, వాటికోసమే మైనింగ్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతున్న అధికారులు పూర్తిస్థాయి వివరాలను వెల్లడించలేదు. 28న ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని, ఆ సందర్భంగానే అన్ని వివరాలు చెబుతామని వారు అంటున్నారు. ముందస్తుగా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరిస్తామని అంటుండటంతో కీలకమైన ఆ ప్రక్రియను నీరుగార్చే అవకాశం ఉందన్న ఆందోళన స్థానిక ప్రజల్లో నెలకొంటోంది. మరోవైపు ఈ లోహాన్ని సాధారణ అవసరాలతోపాటు, యురేనియం వెలికితీతకు ఉపయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొన్ని రకాల క్వార్టజైట్‌ ఖనిజాల నుండి ఈ అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తరహా క్వార్టజైట్‌ లభించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. పొరుగున ఉన్న ఒడిషాతో పాటు ఛత్తీస్‌గడ్‌లో కూడా ఈ తరహా ఖనిజ నిల్వలు ఉన్నట్లు సమాచారం దీంతో యురేనియం కోసమే విశాఖ జిల్లాలోని కుసులవాడపై కేంద్ర ప్రభుత్వ దృష్టి పడి ఉంటుందని, అందువల్లనే వివరాలను గోప్యంగా ఉంచుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణ క్వార్టజైట్‌ ఇలా…!
కఠినంగా ఉండే గ్రానైట్‌ తరహా శిలగా దీనిని చెప్పవచ్చు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూగర్భంలో చోటుచేసుకునే ఒత్తిడి వల్ల ఈ శిలలు రూపొందుతాయి. మన దేశంలో ఎక్కువగా క్వార్టజైట్‌ గనులు ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ కాకుండా, బీహార్‌, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఖనిజం లభిస్తోంది. మన దేశంలో 1,251.25 మిలియన్‌ టన్నుల మేరకు ఈ ఖనిజం నిల్వలు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఇది తెలుపురంగులో, పాలరాయి మాదిరిగా ఇది ఉంటుంది. ఇతర రంగుల్లోనూ లభిస్తుంది. ఇళ్ల నిర్మాణాల్లో అందం కోసం దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ల్యాండ్‌ స్కేపింగ్‌, గార్డెన్‌ పాత్‌వేలు, డాబాలు, బాల్కానీలతో పాటు ఈతకొలనుల చుట్టూ దీనిని వాడుతున్నారు. ఈ తరహా క్వార్టజైట్‌ తవ్వకాల అనుమతులను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. అయితే, ఎక్కువగా కొండ ప్రాంతాల్లో లభిస్తుండటంతో పర్యావరణ కారణాలతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం లేదు.

యురేనియం కోసం….
కొన్ని రకాల క్వార్టజైట్‌లలో యురేనియం లభిస్తుంది. ఆ ఖనిజాలను చిన్న ముక్కలుగా చేసి, శుద్ధి చేయడం ద్వారా దీనిని వెలికితీయవచ్చు. ఈ తరహా క్వార్టజైట్‌లలో ఒక్క పిపిఎం (మిలియన్‌కు ఒక్క భాగం) నుండి 8 పిపిఎం వరకు యురేనియం ఉంటుందని సమాచారం. మన రాష్ట్రంలో ఇప్పటికే కడప జిల్లాల్లో ఈ తరహా క్వార్టజైట్‌ను వెలికి తీస్తున్నారు. ఈ జిల్లాలోని అంబకపల్లిర, గువ్వల చెరువు, తుమ్మలపాలెం ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్న క్వార్టజైట్‌ లభిస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ మూడు రకాల క్వార్టజైట్‌ల నిల్వలు ఉండగా, యురేనియంలోనూ ఆమేరకు మార్పులు కనిపిస్తున్నట్లు సమాచారం. ఒడిషాల్లోనూ ఈ తరహా మైనింగ్‌ పెద్దఎత్తున సాగుతోంది.

ప్రభావం ఇలా…
క్వార్టజైట్‌ను శుద్ధిచేసి యురేనియంను వెలికితీసే ప్రక్రియ స్థానికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భూగర్భ జలాలు దాదాపుగా కలుషితమైనాయి. రక్షిత మంచినీటిని సరఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోకపోవడంతో కలుషితమైన నీటినే తాగుతున్న ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. శరీరంమీద పెద్ద ఎత్తున దద్దుర్లు వస్తున్నాయని, ఏం చేసినా తగ్గడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ తవ్వకాలను నిలిపివేసి తమను కాపాడాలన్న స్థానికుల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కుసులవాడలో మాదిరే కడప జిల్లాలోనూ స్థానిక ప్రజలకు ముందస్తు సమాచారం లేదు. పంచాయతీలలో చర్చలు, తీర్మానాలు లేవు. గుట్టుచప్పుడు కాకుండా అధికారుల కన్నుసన్నల్లో వ్యవహారం నడిపించారు. తవ్వకాలు మొదలైన తరువాత విషయం తెలుసుకుని స్థానికులు ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. వివిధ సందర్భాల్లో స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. ఒడిషాలోనూ ఇటువంటి విధానాలనే అమలు చేశారు.

➡️