డేటా సురక్షితమేనా?

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజల్లో ఆందోళన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వాట్సాప్‌ గవర్నెన్స్‌పై రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. డేటా రక్షణ చట్టం లేకుండా అమలు చేయడం ప్రాథమిక హక్కులకు భంగమనే వాదన నెలకొంది. స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌లలో ఉన్న సమస్త సమాచారాన్ని సేకరించి బ్యాంకు ఖాతాలు, ఇతర పేర్లతో జరిపే సైబర్‌ క్రైమ్స్‌ విపరీతంగా పెరిగాయని డిజిపి గురువారం వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో సమాచార పరిరక్షణ ఇప్పుడొక సవాలుగా మారింది. ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. పౌర సేవలను వేగంగా అందిస్తామనే పేరుతో ‘మన మిత్ర’ ద్వారా మొత్తం 520 రకాల సేవలను వాట్సాప్‌ ద్వారా అందించేలా వాట్సాప్‌, మెటా కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కార్పొరేట్‌ కంపెనీలైన వాట్సాప్‌, మెటాల దగ్గర ప్రజల సమాచారం భద్రంగా ఉంటుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ వాట్సాప్‌ సేవల్లో ప్రజలు తమ ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా అందించాల్సి ఉంది. గతంలో ఆధార్‌ సహా అనేక రకాల డాక్యుమెంట్లు దుర్వినియోగం సంఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటివి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమాచారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో లభ్యమవ్వడంతో అప్పట్లో ఈ అంశంపై రాజకీయంగా పెద్ద దూమారం రేగింది. ప్రజల ఆధార్‌ను ఉపయోగించి ఫారం-7 ద్వారా ఓట్లు తొలగిస్తున్నారని టిడిపి, వైసిపి పరస్పరం విమర్శలూ చేసుకున్నాయి. ప్రజల్లో కూడా తమ ఓట్లు తొలగిస్తున్నారనే ఆందోళన గతంలో నెలకొంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసుకునేందుకు గత వైసిపి ప్రభుత్వం వాట్సాప్‌లో చాట్‌బండ్‌ను తీసుకొచ్చింది. దీనిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజల సమాచారం ప్రైవేట్‌ కంపెనీలకు చేరాయి. డేటా ప్రైవసీ చట్టం-2018 ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఇది చట్టం కాకుండా ఇలాంటి సేవలు తీసుకురావడం పౌరుల వ్యక్తిగత భద్రతకు ముప్పు అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికీ పలు కార్పొరేట్‌ కంపెనీలు, ప్రైవేట్‌ బ్యాంకులు రుణాలు అందిస్తామనే పేరుతో ఆధార్‌కు అనుసంధానమైన ప్రజల ఫోన్‌ నెంబర్లను తీసుకొని వేధింపులకు గురిచేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ను మెటానే నిర్వహిస్తోంది. ఈ యాప్‌లో అనేక మంది యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఒక వ్యక్తి పేరుతో నకిలీ ఖాతాను తెరిచి సైబర్‌ నేరగాళ్లు డబ్బులు అడుగుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇందులో అనేక మంది డబ్బులు చెల్లించి మోసపోయారు. ఇలాంటి సైబర్‌ నేరాలపై ఫేస్‌బుక్‌ను ప్రభుత్వాలు ఎప్పుడూ హెచ్చరించలేదు. ఫేస్‌బుక్‌ కూడా ఈ కేసులను నియంత్రించలేకపోయింది. ఇప్పుడు అదే కంపెనీతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మీ సేవ, సచివాలయ వ్యవస్థలను వినియోగించకుండా, సచివాలయ సిబ్బందిని కుదించేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

➡️