పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడిని విరమించుకోవాలి

– ఆవాజ్‌ రాష్ట్ర సదస్సులో వక్తలు డిమాండ్‌
ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ తొమ్మిది నెలలుగా ఆక్రమణ దాడి చేస్తూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోందని, తక్షణమే ఆ దాడిని విరమించి పాలస్తీనా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, శాంతి నెలకొల్పాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. విశాఖలోని జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో ఆవాజ్‌ ఆధ్వర్యాన పాలస్తీనా సంఘీభావ రాష్ట్ర సదస్సు ఆదివారం జరిగింది. ఆవాజ్‌ రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌ సుభాన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.అరుణ్‌కుమార్‌ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. 75 సంవత్సరాలుగా పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఇజ్రాయిల్‌ అనేక క్రూరమైన దాడులకు పూనుకుంటోందన్నారు. అమెరికా దన్ను చూసుకొని ఇప్పటికే పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించేసిందన్నారు. గాజాను సైతం ఆక్రమించేందుకు దాడులు చేస్తోందని, ఈ క్రమంలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పౌర ఆవాసాలు, ఆస్పత్రులు, కార్యాలయాలను ధ్వంసం చేస్తోందన్నారు. ఈ దుర్మార్గ దాడిని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నా అమెరికా సహకారం ఉండటంతో ఇజ్రాయిల్‌ మరింత రెచ్చిపోతోందని తెలిపారు. ఈ ఆక్రమణ దాడిని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సదస్సులో సంఘం రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా చిష్టి, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, సిపిఐ నాయకులు పి.చంద్రశేఖర్‌, ఎస్‌యుసిఐసి రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.ప్రమీల, సీనియర్‌ న్యాయవాది జాహ్నవి, టిడిపి నాయకులు షేక్‌ చిన్న రెహ్మన్‌, ఆవాజ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి.అయూబ్‌, ఎఎ.అష్రప్‌, ప్రజానాట్యమండలి నాయకులు మౌలాలి పాల్గన్నారు.

➡️