గాలుల బీభత్సం.. నేలనంటిన పంట చేలు
వర్షం రాకతో రైతులు ఉరుకులు, పరుగులు
ప్రజాశక్తి – ముదినేపల్లి (ఏలూరు జిల్లా) : బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా వీస్తున్న ఈదురుగాలులకు కోతకొచ్చిన వరిచేలు నేలకొరిగాయి. దీనికితోడు శుక్రవారం సాయంత్రం వర్షం జల్లులు పడటంతో రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని చినపాలపర్రు, పెదగొన్నూరు, ముదినేపల్లి, వడాలి, పెయ్యేరు, బొమ్మినంపాడు, గురజ, దాకరం తదితర గ్రామాల్లో పంటలు కోత దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో వాయుగుండం ప్రభావంతో పలు గ్రామాల్లో కురిసిన వర్షం, వీచిన గాలులకు వరిచేలు నేలనంటాయి. దీంతో పంటకు కొంతమేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 14 వేల ఎకరాల్లో సార్వా వరి సాగవుతోంది. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు మూడు వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే గరువు ప్రాంత గ్రామాలు చిగురుకోట, అల్లూరు, చినకామనపూడి, బొమ్మినంపాడు తదితర గ్రామాల్లో సుమారు ఐదెకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. మండలవ్యాప్తంగా ఇంకా ఆరు వేల ఎకరాల్లో కోతలు కోయాల్సి ఉంది. పంట చేతికొచ్చిన తరుణంలో రైతులు వరి పంట కోసేందుకు సిద్ధపడుతుండగా వాయుగుండం ప్రభావంతో వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు కోతలు వాయిదా వేశారు. మరో రెండు, మూడు రోజుల వరకు కోతలు కోయొద్దని మండల వ్యవసాయాధికారి వేణుమాధవ్ రైతులకు సూచించారు. ఇప్పటికే యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని తేమశాతం తగ్గించేందుకు కల్లాల్లో, రోడ్ల వెంబడి ఆరబెట్టుతున్న రైతులు శుక్రవారం సాయంత్రం వర్షం పడటంతో ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు ఉరుకులు, పరుగులు తీశారు. ఆరబెట్టిన ధాన్యం రాశులుగా చేసి పరదాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. పంట చేతికొచ్చి మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో వాయుగుండం ఏర్పడి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.