ప్రశ్నించడం నా నైజం.. అందుకే నిలదీశా : గొట్టిముక్కల సుధాకర్‌

విజయవాడ : అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం తనకు చిన్నతనం నుంచి అలవాటు అని, ఆ వైఖరి వల్లే తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివశంకర్‌ ను నిలదీసినట్లు స్థానిక ఓటరు గొట్టిముక్కల సుధాకర్‌ తెలిపారు. ఈ నెల 13న తెనాలిలోని ఐతా నగర్‌ పోలింగ్‌ కేంద్రంలో సుధాకర్‌ చెంపపై ఎమ్మెల్యే శివకుమార్‌ కొట్టడం..అంతే వేగంగా సుధాకర్‌ కూడా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించడం తెలిసిందే. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్‌ ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే శివకుమార్‌, అతని కుటుంబసభ్యులు క్యూలైన్లో కాకుండా నేరుగా వెళ్లి ఓటు వేయడం వల్ల అప్పటికే మూడు, నాలుగు గంటల పాటు ఎండలో ఉన్న వద్ధులు, మహిళలు ఇబ్బంది పడ్డారని, అందుకే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సుధాకర్‌ తెలిపారు. ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. పోలింగ్‌ కేంద్రంలో ఓటరుపై దాడి చేసిన ఘటనలో గుంటూరు జిల్లా తెనాలి వైసిపి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్‌ ఫిర్యాదుతో ఐపిసి 341, 323 సెక్షన్ల కింద తెనాలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️