- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు
- జెన్‌కో కొత్తప్లాంట్ల టారీఫ్‌పై ఎపిఈఆర్‌సి విచారణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జెన్‌కో నూతన ప్లాంట్ల నిర్మాణ జాప్యం వల్ల పెరిగిన అదనపు క్యాపిటల్ వ్యయ భారం వినియోగదారులపై వేయడం తగదని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు కోరారు. శ్రీదామోదరం సంజీవయ్య, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లలో నూతనంగా నిర్మించిన 800 మెగావాట్ల ప్లాంట్ల అదనపు కాపిటల్ వ్యయం, టారీఫ్‌ల అనుమతులపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఈఆర్‌సి) బుధవారం విచారణ నిర్వహించింది. ఎపిఇఆర్‌సి ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో బాబూరావు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. నూతన ప్లాంట్ల నిర్మాణం వల్ల క్యాపిటల్ వ్యయం దాదాపు రెట్టింపు అయ్యిందని తెలిపారు. ఒక మెగావాట్ విద్యుత్‌కు వ్యయం రూ.5 నుంచి 11 కోట్లకు పెరిగిందని వివరించారు. ఉద్దేశపూర్వకంగా పాలకులు అవలంభించిన విధానాలే దీనికి కారణమని విమర్శించారు. ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను దెబ్బతీసి ప్రైవేటీకరణ విధానాలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పెంచి పోషిస్తు న్నాయని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యుత్ రంగం మొత్తాన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని అన్నారు. క్యాపిటల్ ఖర్చులు పెంచి ఫిక్స్‌డ్ ఛార్జీలు రూపంలో విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై రానున్న 25 ఏళ్లపాటు మోపుతున్నారని అన్నారు. నిర్మాణ జాప్యం చేసిన కాంట్రాక్టర్ల నుంచి నష్టాన్ని రాబట్టకుండా ప్రజలపై భారం వేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. థర్మల్ ప్లాంట్లలో పెద్దఎత్తున అవినీతి సాగుతోందని విమర్శించారు. బడా కంపెనీలకు రాయితీలు ఇస్తూ ప్లాంట్ల నిర్మాణంలో మృతిచెందిన కార్మికులకు మాత్రం నష్టపరిహారం చెల్లించటంలో బేరసారాలు ఆడటం దుర్మార్గమన్నారు. ప్లాంట్ వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నదని, వ్యవసాయంపై ప్రభావం పడుతుందని చెప్పారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలపై భారాలు పడకుండా ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని చెప్పారు. కాంట్రాక్టర్ల మేలు కోసం ప్రజలపై భారాలు మోపుతూ అధికారులు చేసిన ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కమిషన్‌ను కోరారు. బుడమేరు వరదల్లో సర్వస్యం కోల్పోయిన వినియోగదారుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు రద్దు చేయాలని కోరారు. గత ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపే విధంగా అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రీన్ పవర్‌పేరుతో కొత్త ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలపై చర్చ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు.