కల్తీ అయ్యింది నెయ్యి కాదు.. ఆవులే : తమ్మినేని సీతారాం

తిరుపతి : కల్తీ అయ్యింది నెయ్యి కాదని, ఆవులే కల్తీ అయ్యాయని వైసిపి నేత, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తిరుమలలో నెయ్యి కల్తీ ఘటన సంచలనం రేపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో … తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. సీతారాం మాట్లాడుతూ … కల్తీ నెయ్యిగా చెబుతున్నది పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారుచేసే నెయ్యి కావొచ్చని.. ఆవాలు, అవిశలు, పామాయిలు వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవుల పాల నుంచి తయారుచేసే నెయ్యి అయి ఉండొచ్చని తమ్మినేని సీతారాం అన్నారు. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్టు లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారని విమర్శించారు. పరీక్షల్లో కచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని, ఎస్‌డీబీబీ తన నివేదికలో స్పష్టం చేసిందని అన్నారు. ఎంతో భద్రంగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడిని మనమే తగ్గించుకోవడం అవుతుందన్నారు. చంద్రబాబునాయుడు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️