- సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఘటన
- బాధ్యులను గుర్తించిన తర్వాత చర్యలు : డిఐజి
ప్రజాశక్తి -తిరుపతి సిటీ : తిరుపతి బైరాగపట్టెడ టోకెన్ కేంద్రం వద్ద ఊహించని విధంగా భక్తుల రద్దీ పెరగడంతో ఈ సంఘటన జరిగిందని అనంతపురం రేంజ్ డిఐజి డాక్టర్ షేమోషి బాజ్పాయ్ తెలిపారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్నవారు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ సంఘటన జరిగినట్టు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈ సమగ్ర విచారణలో బాధ్యులను గుర్తించిన తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత గేట్లను తెరిచారా? లేదా విధుల్లో నిర్లక్ష్యంతో గేట్లు తీసి యాత్రికులను ఒక్కసారిగా వదిలారా? అనేది కూడా నిశితంగా విచారిస్తున్నామన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సాంకేతికపరమైన అన్ని సాక్ష్యాలనూ సిసి కెమెరా పుటేజ్, మొబైల్లో తీసిన వీడియో ఫుటేజీలు, ఫొటోలు, ఇతర అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశికి సమగ్రమైన ప్రణాళికతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కుప్పం బందోబస్తు, వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు వేరువేరుగా పోలీసు బలగాలను నియమించామన్నారు. కుప్పం బందోబస్తుకు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పోలీసు బలగాలను మళ్లించారనే ఆరోపణలు వాస్తవం కాదన్నారు. భక్తుల భద్రత కోసం తిరుపతిలో 1500 మందికి పైగా పోలీసులను టోకెన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుమల, తిరుపతి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి బందోబస్తు కోసం 2424 మంది పోలీస్ బలగాలు విధుల్లో ఉన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు సంబంధించి పోలీసులను వినియోగించడంలో సంఖ్యాపరంగా కొరత ఏమాత్రమూ లేదని తెలిపారు.