ప్రజాశక్తి – భీమవరం టౌన్ (పశ్చిమగోదావరి జిల్లా) : వైసిపి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటి శాఖ అధికారుల తనిఖీలు ఆదివారం కూడా కొనసాగాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని శ్రీనివాస్ ఇంట్లో గత కొన్ని రోజులుగా ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసంతోపాటు సంజన డెవలపర్స్ రియాల్టర్ జాన్ వెస్లీ ఇంట్లోనూ, పలువురు వ్యాపారుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. ఇప్పటికే ఈ తనిఖీల్లో భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భీమవరంలో ఎప్పుడూ లేని విధంగా రోజుల తరబడి ఐటి అధికారులు తనిఖీలు చేయడంపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
